జనం ఇబ్బందులు.. శాశ్వత పరిష్కారం.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు పైనే చర్చ

జనం ఇబ్బందులు.. శాశ్వత పరిష్కారం.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు పైనే చర్చ

 

  • శాశ్వత పరిష్కారం కోసం  అధికారులు, ప్రజాప్రతినిధుల యత్నం 
  • మే 22న ఆఫీసర్లతో కలిసి డంపింగ్ యార్డు విజిట్​ 
  • సీఎం ఆదేశాలతో ఎంఎంసీ అభివృద్ధిపై అఖిలపక్ష సమావేశం
  • ఇతర సమస్యల పైనా చర్చ 

హైదరాబాద్ సిటీ, వెలుగు : జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల ఏండ్లుగా అక్కడి జనం ఇబ్బందులు పడుతున్నారని, సమస్యకి శాశ్వతంగా పరిష్కారం చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఏకాభిప్రాయానికి వచ్చారు. 

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నాగోల్ స్వాగత్ గ్రాండ్ హోటల్ లో గురువారం ఎంఎంసీ అభివృద్ధి కోసం టౌన్ హాల్  మీటింగ్ పేరుతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, సీపీ సుమతి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డుపైనే చర్చ జరిగింది. 

కంపు భరించలేకపోతున్నరు

జవహర్​నగర్​డంపింగ్ యార్డు చుట్టూ దుర్గంధం వెదజల్లుతోందని, అక్కడి నీటిని కూడా వినియోగించలేకపోతున్నారని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. జవహర్ నగర్‌‌‌‌‌‌‌‌ను దత్తత తీసుకున్నామని చెప్పిన రాంకీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని, మేడ్చల్​ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. సీఎస్ఆర్ కింద రూ.35 కోట్లు ఖర్చు చేస్తామని 3 పైసలు కూడా పెట్టడం లేదన్నారు. డంపింగ్ యార్డు కారణంగా పరిసర  ప్రాంతంలోని నీరు కలుషితమైందని, అక్కడి ప్రజలకు ఉచితంగా తాగునీరు అందించాలని కోరారు. 

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి మాట్లాడుతూ  జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల అక్కడ భూగర్భ జలాలు కలుషితమై  స్థానిక మహిళలకు  అబార్షన్ లు అవుతున్నాయని,  జవహర్ నగర్ ప్రాంత ప్రజలకు ట్యాక్స్ లు రద్దు చేయాలన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డంపింగ్ యార్డు వల్ల  చెరువులో చేపలు కూడా బతకడం లేదని, సైనిక్ పురి వరకు వాసన వస్తోందన్నారు. డంపింగ్ యార్డ్ ను తొలగించే వరకు అందరం పోరాటం చేయాలన్నారు. 

మిగతా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాంకీ సీఎస్ఆర్ నిధులు రూ.35 కోట్లను యార్డు చుట్టూ పక్కల చేసే పనుల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. అసలు డంపింగ్​యార్డు దగ్గర పరిస్థితి ఎలా ఉందో ముందు చూడాలని, దాని కోసం అందరూ కలిసి శుక్రవారం విజిట్ చేయాలని నిర్ణయించారు.  

ఫ్లై ఓవర్లు, ఫుట్​పాత్​లపై డిస్కషన్​

డంపింగ్​యార్డుతో పాటు ఎంఎంసీ పరిధిలో రోడ్ల విస్తరణ, కొత్త ఫ్లైఓవర్లు, ఫుట్ పాత్ ల ఆక్రమణ, శానిటేషన్, నాలాల నిర్వహణతో పాటు వచ్చే వర్షాకాలంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.  తమ  నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న డెవలప్మెంట్ వర్క్స్ పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు కమిషనర్ ని కోరారు. 

వర్షాలు వస్తే  మహేశ్వరం, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, నాలా పనులు వెంటనే పూర్తి చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మల్కాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాలాల్లో పూడికతీత పనులు చేయలేదన్నారు. 

నాలుగు వైపులా డంపింగ్​ యార్డులు  

కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జవహర్ నగర్ డంపింగ్ యార్డుకి సంబంధించి రాంకీ సంస్థతో కో ఆర్డినేట్ చేస్తామని,  ఒప్పందం ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని రాంకీకి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను డీ సెంట్రలైజ్ చేయాలని, నగరానికి నాలుగు వైపులా కొత్తగా డంపింగ్ యార్డులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నార. ఆయా డంపింగ్ యార్డుల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు.