- చైనా నుంచి వచ్చి క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్న టెక్నికల్ టీం
హైదరాబాద్, వెలుగు: బ్యాటరీలు పేలుతుండడంతో రాష్ట్రంలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులన్నింటినీ నిలిపివేసిన ఆర్టీసీ యాజమాన్యం..తనిఖీల అనంతరం ఫిట్నెస్ బాగున్న 150 బస్సులను తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 500 జేబీఎం ఈ బస్సులను తిప్పుతున్నారు. అయితే కరీంనగర్‌లో వరుసగా బ్యాటరీలు పేలి మంటల్లో బస్సులు కాలిపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని గురువారం అన్ని ఈ బస్సులను నిలిపివేశారు. చైనా నుంచి వచ్చిన బ్యాటరీ తనిఖీల ప్రత్యేక బృందం ప్రతి బస్సు ఫిట్నెస్‌ను క్షుణ్నంగా తనిఖీలు చేసింది.
ఇందులో 150 బస్సుల ఫిట్నెస్ బాగుండడంతో వాటిని శుక్రవారం మధ్యాహ్నం నుంచి జేబీఎస్ నుంచి పలు జిల్లాలకు నడిపారు. మిగిలిన 350 బస్సుల ఫిట్నెస్‌పై చైనా టెక్నికల్ టీం తనిఖీలు చేస్తున్నది. శనివారం మరికొన్ని బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం డిపోలకే పరిమితమైన 350 ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో డీజిల్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకున్నది.
