అనారోగ్యంతో అరుణోదయ నాగన్న మృతి.. ప్రజా గాయకుడికి పలువురి నివాళి

అనారోగ్యంతో అరుణోదయ నాగన్న మృతి.. ప్రజా గాయకుడికి పలువురి నివాళి

ఖమ్మం టౌన్, వెలుగు: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పరకాల నాగయ్య(70) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం రాజారం గ్రామంలో పేద గీత కార్మిక కుటుంబంలో జన్మించారు. గోదావరిలోయ ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించిన ఆయన 50 ఏళ్లుగా విప్లవ కళారంగానికి సేవలందించారు. అరుణోదయ సాంస్కృతిక సంస్థ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. విప్లవ గేయాలు, బుర్రకథలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు ప్రజా సమస్యలపై పాటలు రాసి స్వయంగా పాడారు. గిరిజనుల పోడు భూముల సమస్య, యుగానిక ఆకు పోరాటం, సారా వ్యతిరేక పోరాటంతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 

అరుణోదయ సాంస్కృతిక సంస్థ సారథిగా వందలాది కళాకారులకు డప్పు నృత్యం, పాటలపై శిక్షణ శిబిరాలు, నృత్యరూపకం కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ కేసుల్లో అరెస్ట్​ అయ్యారు. నాగన్న మృతదేహాన్ని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం వరకు ఉంచారు. ఆ తర్వాత అక్కడి నుంచి సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయానికి తీసుకువచ్చారు. శనివారం ఆయన భౌతికకాయాన్ని గవర్నమెంట్​ మెడికల్  కాలేజీకి అప్పగించనున్నారు. 

ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ మధు, జూలూరి గౌరీశంకర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య, అవునూరి మధు, విప్లవ కుమార్, సుగుణ రావు, పోటు సూర్యం, సీపీఐ ఎంఎల్  మాస్ లైన్  రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవులు అశోక్, పుల్లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, బండి రమేశ్, కల్యాణం వెంకటేశ్వరరావు, గుంతేటి వీరభద్రం, స్పర్శ భాస్కర్, దేవిరెడ్డి విజయ్, ఎన్.తిర్మల్, కట్టెకోల చిననర్సయ్య, జర్నలిస్ట్  సంఘం నేత చిర్రా రవి, శ్రీనివాస్  ఆయనకు నివాళులు అర్పించారు.