జేసీబీలు సాయమైతున్నయ్

జేసీబీలు సాయమైతున్నయ్

హైదరాబాద్ , వెలుగు: కాల్వలు తవ్వడానికి..అక్రమ కట్టడాలు కూల్చడానికే కాదు.. భారీ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకూ జేసీబీలే హెల్ప్​ చేస్తున్నాయి. బాధితుల రెస్క్యూ కోసం పోలీసులు, జీహెచ్ ఎంసీ సిబ్బంది ఫస్ట్ ఆప్షన్ గా దాన్నే ఎంచుకుంటున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని తరలించడం.. గల్లంతై చనిపోయిన వారి మృతదేహాలను వెలికి తీయడం..వాహనాలను తరలించడం వంటివి చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 15 జేసీబీలను రెస్క్యూ ఆపరేషన్ల కోసం పోలీసులు, జీహెచ్ ఎంసీ సిబ్బంది వాడుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేషనల్ హైవేస్ హైదరాబాద్ , విజయవాడ, వరంగల్ హైవేలపై జేసీబీలతోనే సహాయ చర్యలు చేపడుతున్నారు.

సరూర్ నగర్ లో 45 మంది తరలింపు సరూర్ నగర్ , ఎల్బీనగర్ ప్రాంతాల్లో స్థానిక ఇన్ స్పెక్టర్ జేసీబీలతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. సరూర్ నగర్ లోని కమలానగర్ లో వరదలతో ఇండ్లపైకి ఎక్కి తలదాచుకున్న 25 కుటుంబాలను వాటితో కాపాడారు. జేసీబీ ముందు భాగంలో ఉండే డోజర్ లో వారందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్లారు. దిల్ సుఖ్ నగర్ వీవీ నగర్ లో ఇద్దరు వృద్ధులను రక్షించారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో19 మందిని సేఫ్ ప్లేస్ లకు తరలించారు. ఎల్బీనగర్ లో వరదలో చిక్కుకున్న 4 ఆటోలను బయటకు తీశారు. అబ్దుల్లా పూర్ మెట్ లష్కర్ గూడ, బాటసింగారం వాగుల్లో చిక్కుకున్న  రెండు కార్లను జేసీబీతోనే బయటకు తీశారు. ఘట్ కేసర్ , ఉప్పల్ లో రోడ్డుపై కార్లు , లారీలను పక్కకు తొలగించారు. గత మంగళవారం లష్కర్ గూడలో కొట్టుకు పోయిన రాఘవేంద్ర అనే వ్యక్తి మృతదేహాన్ని జేసీబీ సాయంతోనే కల్వర్ట్ నుంచి కానిస్టేబుల్ సురేందర్ బయటకు తీశారు.