ప్రజ్వల్ రేవణ్ణపై జేడీఎస్ వేటు .. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు

ప్రజ్వల్ రేవణ్ణపై జేడీఎస్ వేటు  .. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు
  • ప్రజ్వల్​ను ఇండియాకు రప్పిస్తం: హోంమంత్రి
  • ఇది సిగ్గుపడాల్సిన అంశం: కుమారస్వామి

బెంగళూరు/న్యూఢిల్లీ: సెక్స్ స్కాండల్ రచ్చ నేపథ్యంలో దేవెగౌడ మనవడు, హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను మంగళవారం జేడీఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణకు షో కాజ్ నోటీసులు జారీ చేసినట్లు జేడీఎస్ వర్గాలు తెలిపాయి.  సెక్స్ స్కాండల్ వివాదం సిగ్గుపడాల్సిన అంశమని.. ఇందులో తాము ఎవరినీ రక్షించే ప్రయత్నం చేయడం లేదని కర్నాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి స్పష్టం చేశారు. ‘దోషి ఎవరు?  వీడియోలను రిలీజ్ చేసిందెవరు? దీని వెనకున్న వ్యక్తి ఎవరు? వాళ్లు మహిళల రక్షకులా?.. ఎవరైనా సరే చింతించాల్సిన అవసరంలేదు. 

ఈ ఘటనపై మేం తగిన యాక్షన్​ తీసుకుంటం” అని మంగళవారం మీడియాకు ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ఒక చిన్నాన్నగా కాదు, సామాన్య పౌరుడిగా చెబుతున్నా.. ఇది సిగ్గుపడాల్సిన అంశమని చెప్పారు. తాను ఎవరినీ వెనకేసుకు రావట్లేదని, జరిగిన ఘటనలపై నిరసన తెలియజేస్తున్నానని వివరించారు. కాగా,  ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వేలాది వీడియోలు బయటకు వచ్చాయి.  రేవణ్ణ ఇంట్లో పనిచేసిన కాలం(2019–- 2022 మధ్య) లో రేవణ్ణ, ఆయన కుమారుడు తనను వేధించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. 

తన కూతురుకు ప్రజ్వల్ వీడియో కాల్స్ చేస్తూ  అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. దీంతో ప్రజ్వల్ తో పాటు ఆయన తండ్రి, హోలెనరసిపూర ఎమ్మెల్యే హెచ్​డీ రేవణ్ణ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు చేసింది రేవణ్ణ దగ్గరి బంధువేనని, ప్రజ్వల్ వీడియోలకు సంబంధించి ఓ పెన్ డ్రైవ్​ను పోలీసులకు అందజేశారని సమాచారం. చాలా వీడియోలలో వాటిని రికార్డు చేసింది ప్రజ్వలేనని కనిపిస్తోందని కర్నాటక మహిళా కమిషన్ చైర్​పర్సన్ నాగలక్ష్మి చౌదరి చెప్పారు. మరోవైపు, ఈ వీడియోలు బయటపడడంతో ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు. కేసు నమోదు కావడంతో ప్రజ్వల్ ను ఇండియా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర ప్రకటించారు.