హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ యాసంగిలో ఇప్పటి వరకు 37.59 లక్షల టన్నుల వడ్లు సేకరించినట్టు సివిల్సప్లయ్స్డిపార్ట్మెంట్ వెల్లడించింది. నిరుడు కంటే ఈయేడు అదనంగా 3.62 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా సేకరించిటన్టు చెప్పింది. గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం... ఇదే టైంలో 33.97 లక్షల టన్నుల ధాన్యం సేకరించిందని తెలిపింది. ఈమేరకు మంగళవారం సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ఇప్పటి వరకు కొనుగోలు చేసిన యాసంగి ధాన్యం వివరాలు వెల్లడించింది. ఈసారి 7,245 కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలని ప్లాన్ చేసి.. 7,171 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు చేపట్టింది. ఏప్రిల్30 నాటికి 16.93 లక్షల టన్నులు సేకరించింది. లాస్ట్ ఇయర్ ఇదే టైమ్‌కు కేవలం 6.71 లక్షలు మాత్రమే కొనుగోళ్లు జరిగాయని తెలిపింది. ఈనెల 15 వరకు 32.93 లక్షల టన్నులు సేకరించగా.. లాస్ట్ ఇయర్ఇదే టైమ్‌కు 25.15 లక్షల టన్నులు మాత్రమే సేకరించినట్టు వెల్లడించింది. నిరుడు కంటే ముందే కొనుగోళ్లు ప్రారంభించడంతో పాటు గత ఏడాది కంటే ఎక్కువ వడ్లు కొనుగోళ్లు చేస్తున్నా.. పలువురు అసత్య ప్రచారం చేయడాన్ని సివిల్ సప్లయ్స్ శాఖ ఖండించింది.
