జీడిమెట్ల, వెలుగు: ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన 15 మందిపై పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్ పరిధి రంగారెడ్డి బండ, యాదిరెడ్డి బండ బస్తీల్లో సర్వే నంబర్ 25/1,25/2 లలో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో క్వారీ గుంతలు ఉన్నాయి. కొంతమంది రాత్రికి రాత్రి మట్టితో క్వారీ గుంతలను పూడ్చి, గదులు నిర్మిస్తున్నారు.
వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ రెహమాన్ పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు సంపంగి వెంకటేశ్, ఇందిరారెడ్డి, రామ్ రెడ్డి, ఆలకుంట సురేశ్, గంగుల లక్ష్మయ్య, పసుపుల కొండయ్య, శ్రీకాంత్, బాలకృష్ణ, దంగుల లక్ష్మి, లక్ష్మమ్మ, రాములమ్మ, మరాఠీ సుక్కమ్మ, వెంకటమ్మ, నాగమణి, యాదమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్హెచ్చరించారు.
