జీడిమెట్ల, వెలుగు: సైకిల్లో గాలి తీస్తున్నాడనే అనుమానంతో ఓ విద్యార్థిని హెచ్ఎం సీనియర్ విద్యార్థులతో కొట్టించాడు. కొంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో తరచూ విద్యార్థుల సైకిళ్లలో గాలి తీస్తున్నారు. అంతేగాకుండా సైకిల్ పెడల్స్ చోరీకి గురవుతున్నాయి. సోమవారం ఎవరు గాలి తీస్తున్నారో చూసి రమ్మని ఏడో తరగతి చదువుతున్న ఫణీంద్ర సూర్యను టీచర్ మధు పంపించాడు.
ఫణీంద్ర సైకిళ్ల వద్దకు వెళ్లి గమనిస్తుండగా చారీ అనే మరో టీచర్ చూశాడు. ఫణీంద్రనే గాలి తీస్తున్నాడని భావించి హెచ్ఎం కృష్ణ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు కర్రలు ఇచ్చి ఫణీంద్ర వీపుపై కొట్టించాడు. వారి దాడిలో బాలుడి వీపుపై భారీగా వాతలు పడ్డాయి. ఇంటికి వెళ్లిన ఫణీంద్ర తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు దవాఖానకు తీసుకెళ్లారు.
