చంద్రబాబు పాలనలో మహిళలపై అత్యాచారాలు: జీవిత

చంద్రబాబు పాలనలో మహిళలపై అత్యాచారాలు: జీవిత

ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో మహిళల పై అత్యాచారాలు పెరిగాయని అన్నారు వైసీపీ నాయకులు జీవితా రాజశేఖర్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన జీవిత.. కాల్ మనీ పేరుతో ఏపీలోని ఎందరో మహిళలను టీడీపీ నాయకులు లోబరుచుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో కాల్ మనీ, సెక్స్ రాకెట్స్ గురించి ప్రశ్నించినందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజాను సభ నుంచి బహిష్కరించారని అన్నారు. టీడీపీ నాయకుల సెక్స్ రాకెట్ ను బయటకు రాకుండా ఎల్లో మీడియా అడ్డుకుందని చెప్పారు.

వైఎస్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగిందని అన్నారు జీవిత రాజశేఖర్. ఆరోగ్య శ్రీ లాంటి గొప్ప పథకాలు వైఎస్ హయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు. వైసీపీ చీఫ్ జగన్ ప్రజల మధ్యనే ఉంటూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. పవన్ లాగా ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు చేయడం లేదని అన్నారు. పవన్ బాహుబలి లాంటి ప్యాకేజీకి అమ్ముడు పోయారని చెప్పారు. చంద్రబాబు నాలుగేళ్లుగా అవినీతి చేస్తుంటే పవన్ ఏం చేశారని ప్రశ్నించారు.

చంద్రబాబు అమరావతి రైతుల భూములు అమ్ముకుని సింగపూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అరోపించారు జీవిత రాజశేఖర్. 2014 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తే.. 21వేల కోట్లు ఉన్న డ్వాక్రా రుణాలను చంద్రబాబు రద్దు చేస్తానన్నారని ఇప్పటివరకు చేయలేదని చెప్పారు జీవిత. ఇప్పుడు పసుపు కుంకుమల పేరుతో చంద్రబాబు ఓట్లర్లకు గాలం వేస్తున్నారని అన్నారు.

లక్ష్మీ పార్వతి గురించి తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు జీవిత రాజశేఖర్. మంచి కుటుంబంలో పుట్టిన వారెవరైనా ఇలా ఒక మహిళపై తప్పుడు ప్రచారం చేయరని అన్నారు. చంద్రబాబుకు, పవన్ కు ఓటు వేసి తమ ఓటును వేస్ట్ చేసుకోవద్దని ఆంధ్ర ప్రజలకు హితవుపలికారు జీవిత.