రీల్స్ స్టార్‌‌‌‌ కాదు రియల్‌‌ ఫైటర్‌‌.. విమర్శల దాడిని జయించిన జెమీమా

రీల్స్ స్టార్‌‌‌‌ కాదు రియల్‌‌ ఫైటర్‌‌.. విమర్శల దాడిని జయించిన జెమీమా

రన్స్‌‌ చేయదు గానీ సోషల్ మీడియా రీల్స్‌‌ చేస్తుందన్న అపవాదు..! తండ్రి మత మార్పిడిలు ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ వర్గం నుంచి వేధింపులు..! గత వరల్డ్ కప్‌‌ టీమ్‌‌లో చోటే దక్కలేదన్న బాధ..  ఈ టోర్నీలోనూ తుది జట్టులో స్థానం ఉంటుందో లేదోనన్న భయం! ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌‌ ముందు జెమీమా రోడ్రిగ్స్ పరిస్థితి ఇది. తీవ్రమైన ఆందోళన, దిక్కుతోచని స్థితిలో ప్రతీ రోజూ  ఆమె కంట కన్నీళ్లే..!  

కానీ, ఆ కన్నీళ్లనే తను కసిగా మార్చింది. తన గుండెలోని బాధ బరువంతా బ్యాట్‌‌పైకి తెచ్చి ఆస్ట్రేలియా బౌలింగ్‌‌ను బెంబేలెత్తించింది. క్రికెట్‌‌ చరిత్రలో నిలిచిపోయే విజయంలో భాగమై.. తన కెరీర్‌‌‌‌నే మరో మెట్టుకు తీసుకుళ్లే ఇన్నింగ్స్‌‌తో అందరి నోళ్లూ మూయించింది. తనపై నిందలు వేసిన వాళ్ల నుంచే వందనాలు అందుకుంటున్న జెమీమా రోడ్రిగ్స్‌ నిజంగా ఓ జెమ్‌. తను రీల్స్ స్టార్‌‌‌‌ కాదు రియల్‌‌ ఫైటర్‌‌..! 

వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌: ఇండియా విమెన్స్ టీమ్ సర్కిల్స్‌‌లో  జెమీమా రోడ్రిగ్స్‌‌ పేరు చెప్పగానే అందరి పెదాలపై చిరునవ్వు కనిపిస్తుంది. ఎందుకంటే  మైదానం లోపల.. బయటా జెమీ ఎంతో హుషారుగా ఉంటుంది. టీమ్‌‌ మేట్స్‌‌తో కలిసి  డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, సోషల్ మీడియాలో సరదాగా రీల్స్‌‌ చేస్తుంటుంది. మల్టీ టాలెంట్ స్కిల్స్‌‌ ఉన్న  అల్లరిపిల్లలా అందరికీ పరిచయం ఉన్న జెమీమా గురువారం రాత్రి ఆస్ట్రేలియాపై విజయానంతరం అంతలా భావోద్వేగానికి గురవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

మ్యాచ్‌ ముగిసిన చాలాసేపటి తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లోనూ ఆమె కన్నీళ్లు ఆగలేదు. ఆ కన్నీళ్లు విమెన్స్ వన్డే చరిత్రలోనే నిలిచిపోయే విజయాన్ని ఇండియాకు అందించినందుకు వచ్చినవి మాత్రమే కాదు. గత కొన్ని నెలలుగా తాను అనుభవిస్తున్న నరకయాతనకు, దారుణమైన విమర్శల దాడికి బ్యాట్‌‌తో సమాధానమిచ్చిన ఉపశమనం. అవి ఆస్ట్రేలియాపై రికార్డు టార్గెట్ ఛేజ్ చేసి ఇండియాను వరల్డ్‌‌  కప్ ఫైనల్‌‌కు చేర్చడమే కాదు, తనను తాను నిరూపించుకున్న ఒక యోధురాలి గాథను లిఖించాయి.  

కసిగా మారిన కన్నీళ్లు

ఈ సెమీఫైనల్‌‌కు ముందు జెమీమా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ‘టీమ్ కోసం రన్స్ చేయడం చేతకాదు గానీ, సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోంది’  అన్న అపవాదు ఎదుర్కొంది. ఫామ్ లేమితో ఇంగ్లండ్‌‌తో మ్యాచ్‌‌లో తుది జట్టు నుంచి ఉద్వాసనకు గురైంది. గత వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదన్న బాధ వెంటాడింది. వీటన్నిటితో తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైంది. 

‘టోర్నమెంట్ ఆరంభంలో తీవ్ర ఆందోళనతో బాధపడ్డాను. ప్రతిరోజూ మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేదాన్ని’ అని మ్యాచ్ అనంతరం ఆమె చెప్పిన మాటలు తన మానసిక క్షోభకు అద్దం పట్టాయి. కానీ, ఆ కన్నీళ్లనే కసిగా మార్చుకుంది. ఆస్ట్రేలియా ఇచ్చిన రికార్డు టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఆరంభంలోనే రెండు వికెట్లు పడిన తర్వాత కొత్తగా మూడో నంబర్‌‌‌‌లో బ్యాటింగ్‌‌కు  దిగింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ  కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ కౌర్‎తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పింది.

 జెమీ 127 రన్స్‌‌ ఇన్నింగ్స్‌‌లో 14 ఫోర్లు ఉన్నా కీలకంగా నిలిచింది మాత్రం ఆమె వికెట్ల మధ్య పరిగెత్తిన సింగిల్స్, డబుల్సే. భారీ టార్గెట్‌‌ను కరిగించే క్రమంలో స్కోరు బోర్డును నిరంతరం కదిలేలా చేసింది. అయితే, కీలక సమయంలో హర్మన్ ఔట్ కావడంతో.. 2023 టీ20 వరల్డ్‌‌ కప్ సెమీస్ పరాభవం కళ్ల ముందు కదలాడింది. కానీ, ఈసారి జెమీమా  గత చరిత్ర పునరావృతం కానివ్వలేదు. కండరాల నొప్పులు బాధిస్తున్నా, ఒంటరి పోరాటం చేసింది. జట్టును గెలుపు తీరాలకు చేర్చే వరకూ విశ్రమించలేదు.

దటీజ్ జెమీ..

జెమీమా చేసిన ఈ పోరాటం కేవలం మైదానానికే పరిమితం కాదు. సరిగ్గా ఏడాది క్రితం ఆమె తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్‌‌ మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న నిరాధార ఆరోపణలతో ముంబైలోని ఖార్ జింఖానా క్లబ్ జెమీమా గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేసింది. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు ఆమె క్రైస్తవ విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకుని దారుణంగా ప్రచారం చేశారు.  

ఇది జెమీమాను చాలా కుంగదీసింది. అయితే, ఖార్ జింఖానా ప్రెసిడెంట్ వివేక్ దేవనాని స్వయంగా ఈ మత మార్పిడి ఆరోపణలను ఖండించారు. క్లబ్‌‌లో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో, ఒక వర్గం వారు రాజకీయ లబ్ధి కోసమే ఈ వివాదాన్ని సృష్టించారని అప్పుడే స్పష్టం చేశారు. అయినా జెమీమాపై, ఆమె ఫ్యామిలీపై విమర్శలు ఆగలేదు. 

వాటిపై ఎప్పుడూ నోరుమెదపని జెమీ  ఇప్పుడు తన అద్భుతమైన ఆటతీరుతోనే ఆ విమర్శకులందరి నోళ్లు మూయించింది. సెమీ-ఫైనల్ గెలిచిన తర్వాత కూడా ‘ఈ విజయం నాది కాదు, ఇది జీసస్ వల్లే సాధ్యమైంది. నేను ఒంటరిగా ఇది చేయలేను’ అని తన విశ్వాసాన్ని ఆమె ధైర్యంగా ప్రకటించింది. గతేడాది వేధించిన వారే తనను ప్రశంసించేలా చేసుకుంది. దటీజ్ జెమీమా. అన్ని అడ్డంకులను, ద్వేషాన్ని జయించిన జెమీ ఫైనల్లోనూ సత్తా చాటి ఇండియాను వరల్డ్‌‌ చాంపియన్‌‌గా నిలబెట్టాలని ఆశిద్దాం. 

ఈ టోర్నీ ప్రారంభంలో నేను తీవ్రమైన ఆందోళన(యాంగ్జైటీ)తో బాధపడ్డా. కొన్నిసార్లు ఏమీ తోచని స్థితిలోకివెళ్లిపోయేదాన్ని. చాలా మ్యాచ్‌‌లకు ముందు మా అమ్మకు ఫోన్ చేసి గంటల తరబడి ఏడ్చేదాన్ని. నా బాధనంతా బయటకు చెప్పేదాన్ని. ఈ సమయంలో మా అమ్మానాన్న నాకు ఎంతగానో మద్దతుగా నిలిచారు. ఈ క్లిష్ట సమయంలో  నాకు అండగా నిలిచిన  టీమ్‌‌మేట్స్‌‌కు థ్యాంక్స్‌‌. 

ముఖ్యంగా అరుంధతి రెడ్డి.. బహుశా ఈ టోర్నీలో ప్రతిరోజూ నేను ఆమె ముందు ఏడ్చి ఉంటాను. ఆమె రోజూ నా బాగోగులు కనుక్కునేది. స్మృతి మంధాన కూడా నాకు ఎంతో సహాయం చేసింది. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో ఆమెకు తెలుసు. కొన్ని నెట్ సెషన్లలో, ఆమె ఏమీ మాట్లాడకుండా నా పక్కనే నిలబడేది. నా పక్కన ఉండటమే నాకు ముఖ్యమని ఆమెకు తెలుసు. 

జట్టు నుంచి తీసేసినప్పుడు (ఇంగ్లండ్‌‌తో మ్యాచ్‌‌లో) ఓ ప్లేయర్‌‌‌‌లో సహజంగానే ఎన్నో సందేహాలు వస్తాయి. కానీ నేను ఓపికగా వేచి చూశాను. నాకు అండగా నిలిచిన, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ  థ్యాంక్స్‌‌.  ఇక్కడ (ప్రెస్‌‌ కాన్ఫరెన్స్‌‌లో) నేను నా బలహీనత గురించి దాపరికం లేకుండా మాట్లాడుతున్నా. ఎందుకంటే, నాలా ఎవరైనా బాధపడుతుంటే వారికి ఇది సహాయపడవచ్చు. సహాయం అడగడంలో తప్పులేదు. జెమీమా రోడ్రిగ్స్‌‌