న్యూఢిల్లీ: టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) నుంచి వైదొలిగింది. డబ్ల్యూబీఎల్లో బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజ్ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న జెమీమా టోర్నీలో మిగిలిన మ్యాచులకు దూరమైంది. ఈ మేరకు బ్రిస్బేన్ హీట్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. డబ్ల్యూబీఎల్ నుంచి జెమీమా వైదొలిగిన విషయాన్ని ఫ్రాంచైజీ ధృవీకరించింది. టోర్నీలో మిగిలిన మ్యాచులకు జెమీమా అందుబాటులో ఉండదని ప్రకటించింది.
అయితే.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డబ్ల్యూబీఎల్కు జెమీమా సడెన్‌గా దూరం కావడానికి గల కారణం ఏంటంటే.. టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతికి మద్దతుగా ఉండటం కోసమే. హోబర్ట్ హరికేన్స్‌తో మ్యాచ్ తర్వాత స్మృతి మంధాన వివాహానికి హాజరు కావడానికి రోడ్రిగ్స్ ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగివచ్చింది. కానీ 2025, నవంబర్ 23న జరగాల్సిన పలాష్ ముచ్చల్, స్మృతి మందాన వివాహం అనుహ్యంగా చివర్లో వాయిదా పడిన విషయం తెలిసిందే.
స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో లాస్ట్ మినిట్‌లో పెళ్లి పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో డబ్ల్యూబీఎల్లో ఆడేందుకు తిరిగి ఆస్ట్రేలియా వెళ్లకుండా.. తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో పెళ్లి వాయిదా పడిన బాధలో ఉన్న సహచరురాలు స్మృతి మంధానకు అండగా నిలవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీకి తెలియజేసింది.
ALSO READ : నా భవిష్యత్‌ను బీసీసీఐ నిర్ణయిస్తుంది
స్మృతికి మద్దతుగా ఇంకొన్ని రోజులు ఇండియాలోనే ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. జెమీమా అభ్యర్థనను బ్రిస్బేన్ హీట్ యాజమాన్యం అంగీకరించి ఆమెను జట్టు నుంచి రిలీజ్ చేసింది. దీంతో టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచులకు జెమీమా దూరమైంది. జెమిమా టోర్నీ నుంచి వైదొలగడంపై బ్రిస్బేన్ హీట్ సీఈఓ టెర్రీ స్వెన్సన్ స్పందిస్తూ.. జెమీకి ఇది సవాలుతో కూడిన సమయమన్నారు.
ఇకపై ఆమె డబ్ల్యూబీఎల్లో పాల్గొనకపోవడం దురదృష్టకరమన్నారు. స్మృతి మందానకు మద్దతుగా భారతదేశంలోనే ఉండాలనే ఆమె అభ్యర్థనను మేం అంగీకరించామని తెలిపారు. జెమీమా టోర్నీకి దూరమైన బ్రిస్బేన్ హీట్ ఆటగాళ్లతో టచ్ లోనే ఉంటుందని పేర్కొన్నారు. జెమీమా, స్మృతి మంధాన కుటుంబానికి భవిష్యత్తు కోసం బ్రిస్బేన్ హీట్ యాజమాన్యం, ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారని అన్నారు.
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఆస్ట్రేలియాపై వీరోచిత ప్రదర్శనతో విమర్శల చేత ప్రశంసలు అందుకున్న జెమీమా.. ఇప్పుడేమో బాధలో ఉన్న ఫ్రెండ్‌కు అండగా ఉండాలని ఏకంగా డబ్ల్యూబీబీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి తప్పుకుని అభిమానుల మనసులు కొల్లగొట్టింది. నిజమైన ఫ్రెండ్ అంటూ జెమీమాను ఆకాశానికెత్తుతున్నారు.
