షాద్ నగర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి బాడీపై ఉన్న బంగారు నగలును చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల 17న రాత్రి ఫరూఖ్ నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా సమీపంలోని బూర్గుల ఎక్స్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో తుర్కయంజాల్ కు చెందిన పురుషోత్తం రెడ్డి మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన అతని తమ్ముడు విజయానంద రెడ్డి అన్న మృతదేహంపై ఉన్న బంగారు నగలు కనిపించకపోవడంతో షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైవే పెట్రోల్- లో డ్రైవర్ గా పనిచేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాఖాపూర్ గ్రామానికి చెందిన రవి కుమార్ గౌడ్, ఫరూఖ్ నగర్ మండలంలోని బూర్జుగడ్డ తండాకు చెందిన మూడవత్ లోకేష్‌ను అదుపులోనికి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని వారు అంగీకరించారు. నిందితుల నుంచి 2 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెల్లడించారు.
