అన్నం పెడుతున్న సంస్థకే కన్నం

అన్నం పెడుతున్న సంస్థకే కన్నం

బషీర్ బాగ్, వెలుగు: ప్రియురాలి మోజులో పడి తనకు అన్నం పెడుతున్న సంస్థకే కన్నం వేశాడు. 28 తులాల బంగారం దొంగిలించాడు. కొంత బంగారం తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ప్రియురాలితో కలిసి విహారయాత్రలు, తీర్థయాత్రలు చేశాడు. యజమాని ఫిర్యాదుతో చివరికి కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్ నారాయణగూడలో ఈ ఘటన జరిగింది.

బషీర్ బాగ్ చంద్ర నగర్ కు చెందిన మర్రి సాయిలక్ష్మణ్ (35) ఎనిమిదేళ్లుగా స్థానిక శ్రీసిద్ది వినాయక్  జువెలర్స్ అండ్ ఎక్స్​పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో స్టాక్ ఇన్​చార్జిగా పనిచేస్తున్నాడు. రెండు నెలలుగా ఉద్యోగానికి వెళ్లడంలేదు. ఫోన్  చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఆడిట్ చేయించాడు. అందులో 28 తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు గుర్తించారు. దీనితో యజమాని నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి సాయిలక్ష్మణ్​ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బంగారాన్ని తానే దొంగిలించానని ఒప్పుకున్నాడు.