అజిత్ పవార్ లేరని అభిమానులు ఏడుస్తుంటే.. 30 లక్షల బంగారం కొట్టేసిన దొంగలు !

అజిత్ పవార్ లేరని అభిమానులు ఏడుస్తుంటే.. 30 లక్షల బంగారం కొట్టేసిన దొంగలు !

బంగారం ధరలు భారీగా పెరగడంతో దొంగలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అజిత్ పవార్ను చివరి చూపు చూసేందుకు వేల మంది ఆయన అభిమానులు బారామతి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అభిమానుల్లో కలిసిపోయిన దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అజిత్ పవార్ కోసం బారామతికి వెళ్లిన 15 మంది గోల్డ్ చైన్లు మిస్ కావడంతో సదరు బాధితులు లబోదిబోమంటూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ఈ బంగారం విలువ సుమారు 25 నుంచి 30 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు.

బారామతిలో జరిగిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మహారాష్ట్ర ప్రభుత్వం బారామతిలో 8 వేల మంది పోలీసులను బారామతికి పంపింది. ఇంత మంది పోలీసులు విధుల్లో ఉన్నా కూడా ఈ బంగారం దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారని తెలిసి బారామతి ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. కొందరు అనుమానితులను బారామతి పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అజిత్ పవార్ ఇక లేరని బారామతి భావోద్వేగంలో నిండిపోతే.. ఇదేదీ పట్టని దొంగలు గోల్డ్ చైన్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడటం గమనార్హం.

పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. తులం బంగారం లక్షన్నర దాటడంతో అంతర్రాష్ట్ర ముఠాలతోపాటు స్థానిక దొంగలు మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక్క స్నాచింగ్‌‌‌‌ చేస్తే  తక్కువలో తక్కువ రూ.2 నుంచి రూ.3 లక్షల దాకా చేతికి అందుతుండడంతో చైన్​స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైకులపై మెరుపు వేగంతో వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు సహా రోడ్డుపై నడిచివెళ్లే వారి మెడలోంచి పుస్తెల తాళ్లు, చైన్లు తెంపుకెళ్తున్నారు. పట్ట పగలే రెచ్చిపోతున్న దొంగలు.. అడ్డొస్తే హత్య చేసేందుకూ వెనుకాడడం లేదు.