జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి రాందాస్ సొరెన్ కన్నుమూత

జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి రాందాస్ సొరెన్ కన్నుమూత

రాంచీ: జార్ఖండ్ రాజకీయాల్లో మరో విషాదం నెలకొంది. ఇటీవలే ఆ రాష్ట్ర మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వ్యవస్థాపకులు శిబు సోరెన్ మరణించగా.. తాజాగా జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి రాందాస్ సోరెన్ (62) కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (ఆగస్ట్ 15) ఆయన తుది శ్వాస విడిచారు. 2025, ఆగస్ట్ 2న రాందాస్ తన నివాసంలో బాత్రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన మెదడుకు తీవ్ర గాయమై రక్తం గడ్డకట్టింది. అత్యవసర చికిత్స కోసం కుటుంబ సభ్యులు వెంటనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. 

అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందున్న రాందాస్ సొరెన్.. 12 రోజులు ప్రాణాలతో పోరాడి పరిస్థితి విషమించి శుక్రవారం తుది శ్వాస విడిచారు. మంత్రి రాందాస్ సోరెన్ మృతిని ఆయన కుమారుడు ధృవీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. “నా తండ్రి ఇప్పుడు మన మధ్య లేరని చాలా బాధతో మీ అందరికీ తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు. మంత్రి రాందాస్ సోరెన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాందాస్ సోరెన్ మృతికి నివాళిగా జార్ఖండ్ ప్రభుత్వం ఒకరోజు సంతాపం దినంగా ప్రకటించింది. రోజుల వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు మరణించడంతో జార్ఖండ్ పాలిటిక్స్‎లో విషాదచాయలు అలుముకున్నాయి. 

రాందాస్ సొరెన్ నేపథ్యం:

మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన రాందాస్ సొరెన్ 1963, జనవరి 1న తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని ఘోరబంద గ్రామంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెకు ఉన్నారు.  ఘోరబంద పంచాయతీ గ్రామ ప్రధాన్‌గా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు రాందాస్ సొరెన్. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టిన రాందాస్ అంచెలు అంచెలు ఎదిగి చివరికి మంత్రి స్థాయికి చేరుకున్నారు.

 1990లో జేఎంఎం జంషెడ్‌పూర్ తూర్పు అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2005 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఘట్‌శిల అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‎గా బరిలోకి దిగి ఓడిపోయారు. తిరిగి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అదే  ఘట్‌శిల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ తుడు చేతిలో ఓటమి పాలైన రాందాస్.. తిరిగి 2019 అసెంబ్లీ ఎలక్షన్స్‎లో మళ్లీ గెలుపొందారు.

2024లో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ కుమారుడు, బీజేపీ అభ్యర్థి బాబులాల్ సోరెన్‌ను ఓడించి ఘట్ శిల నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హేమంత్ సొరెన్ నేతృత్వంలోని కేబినెట్లో విద్యా, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాందాస్ సోరెన్ మరణించడంతో ఆయన శాఖలను సుదివ్య కుమార్ సోనుకు అప్పగించింది ప్రభుత్వం.