
ముంబై: ఇండియా–ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ ప్రసార హక్కులపై కీలక ఒప్పందం కుదిరింది. ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రత్యేక డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. మరోవైపు, టీవీ ప్రసార హక్కులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వద్దే ఉండనున్నాయి. జూన్ 20న లీడ్స్‌లో ఈ సిరీస్ షురూ అవనుంది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో నెల రోజుల చర్చల తర్వాత సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్, జియో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందం 2026లో ఇంగ్లండ్‌లో జరిగే మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లకు కూడా వర్తిస్తుందని తెలుస్తోంది. సోనీ నెట్ వర్క్ 2031 వరకు ఎనిమిదేండ్ల కాలానికి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. సోనీ, జియో మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదర్చడంలో ఈసీబీ కూడా కీలక పాత్ర పోషించిందని సమాచారం. ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని స్క్రీన్లలో మ్యాచ్‌లను చూసే అవకాశాన్ని కల్పిస్తుందని ఇరు వర్గాలు పేర్కొన్నాయి.