మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)  కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్ ను నియమించింది. పార్టీ చీఫ్  విప్ గా  కూడా ఆయనే ఉంటారని  రాష్ట్ర ఎన్‌సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ తెలిపారు.  2023 జూలై02న అజిత్ పవార్ ఎన్‌సీపీపై తిరుగుబాటు చేసి 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వానికి మద్దతిచ్చారు.  

దీంతో అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కగా ఆయనతోపాటు ఛగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ వాల్సే పాటిల్‌, ధర్మారావ్‌ అట్రాం, సునీల్‌ వాల్సడే, అదితి ఠాక్రే, హసన్‌ ముష్రీఫ్‌,ధనుంజయ్‌ ముండే, అనిల్‌ పాటిల్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి ప్రస్తుతం 53 మంది సభ్యులున్నారు. వారిలో దాదాపు 30 మంది అజిత్‌ పవార్‌కు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ ఉన్నారు.  

మరోవైపు ఎన్‌సీపీ లోని రెండు వర్గాలు 2023 జూలై 5న నేతలతో సమావేశాలు నిర్వహించనున్నాయి. అజిత్ పవార్ వర్గం ముంబైలోని భుజ్‌బల్ నాలెడ్జ్ సిటీలో ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. శరద్ పవార్ వర్గం అదే రోజున మధ్యాహ్నం 1 గంటలకు ముంబైలోని వైబి చవాన్ సెంటర్‌లో సమావేశం కానుంది.  ఎన్సీపీ కార్యకర్తలందరినీ ఈ సమావేశానికి పిలిచామని ఆయన తెలిపారు.