హైదరాబాద్.. ప్రపంచానికి ఫార్మా రాజధాని : జితేంద్ర సింగ్

హైదరాబాద్.. ప్రపంచానికి ఫార్మా రాజధాని : జితేంద్ర సింగ్

యువ సైంటిస్టుల కోసమే ‘వన్ వీక్ వన్ ల్యాబ్’:  జితేంద్ర సింగ్

సికింద్రాబాద్, వెలుగు : ప్రపంచానికి ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతున్నదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. అలాగే, ఆరోగ్యం, సంపదకు కూడా గమ్యస్థానంగా హైదరాబాద్‌ ప్రసిద్ధి చెందిందని కొనియాడారు. నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) దేశంలోని ఫార్మా , బయోటెక్ పరిశ్రమకు ఒక వరమని పేర్కొన్నారు. తార్నాకలోని సీఎస్‌ఐఆర్(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌​ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) -ఐఐసీటీలో ‘వన్ వీక్ వన్ ల్యాబ్’పేరుతో నిర్వహిస్తున్న వర్క్​షాప్‌ను కేంద్ర మంత్రి మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మా క్లస్టర్‌గా మారిందని, ఇది రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌తో పాటు ఫార్మా ప్రాడక్ట్స్ తయారీపై దృష్టి సారించిందని చెప్పారు.

ఈ క్లస్టర్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యతను బట్టి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌గా గుర్తించిందన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 37 సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌లలో ఒక్కో దానిని ఒక్కో రంగానికి కేటాయించమన్నారు. యువ సైంటిస్టులను ప్రోత్సహించేందుకు ‘వన్ వీక్ వన్ ల్యాబ్’ఈవెంట్‌ను ప్రవేశపెట్టామన్నారు. అవసరాలకు అనుగుణంగా మార్పులు చెందుతున్న, ‘సీఎస్‌ఐఆర్‌– ‌-ది ఇన్నోవేషన్ ఇంజిన్ ఆఫ్ ఇండియా’కు సిరికొత్త ట్యాగ్ లైన్ అని ఆయన పేర్కొన్నారు.