- రెండు వర్గాలుగా విడిపోయి అర్ధరాత్రి పరస్పర దాడులు
- చీజ్ ఉత్సవం సందర్భంగా తలెత్తిన వివాదమే కారణం
కూకట్పల్లి, వెలుగు: కూకట్ పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్లో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. గురువారం రాత్రి చీజ్ ఉత్సవం సందర్భంగా తలెత్తిన వివాదంతో పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కేపీహెచ్బీ పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి, ఠాణాకు తరలించారు.
తర్వాత వదిలేశారు. హాస్టల్కు వెళ్లిన కాసేపటికే విద్యార్థుల మధ్య మళ్లీ కొట్లాట మొదలైంది. క్యాంపస్బయటకు వచ్చి దాడి చేసుకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు మరోసారి వచ్చి, విద్యార్థులను ఠాణాకు తీసుకెళ్లారు. గొడవకు కారణమైన ఇరువర్గాలకు చెందిన పలువురు స్టూడెంట్లపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ రితిరాజ్తెలిపారు.
