జేఎన్టీయూ రెక్టర్, రిజిస్ట్రార్పై వీసీ వేటు..కొత్త రెక్టర్‌గా దామోదరం, రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి నియామకం

జేఎన్టీయూ రెక్టర్, రిజిస్ట్రార్పై వీసీ వేటు..కొత్త రెక్టర్‌గా దామోదరం, రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి నియామకం

హైదరాబాద్‌, వెలుగు: జేఎన్టీయూ ​రెక్టర్‌ విజయకుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లుపై వర్సిటీ వీసీ కిషన్ కుమార్ రెడ్డి వేటు వేశారు. కనీసం మూడేండ్ల పాటు కొనసాగించే అవకాశం ఉన్నా.. ఆ కాల పరిమితి పూర్తికాక ముందే వారిని తొలగించి వారి స్థానంలో కొత్త అధికారులను నియమించారు. కొత్త రెక్టర్‌గా సీఎస్‌ఈ విభాగం ప్రొఫెసర్‌ ఎ.దామోదరం, రిజిస్ట్రార్‌గా ఈఈఈ ప్రొఫెసర్‌ జయలక్ష్మిని 
నియమిస్తూ స్వయంగా ఆయనే ఉత్తర్వులిచ్చారు.

శుక్రవారం సాయంత్రం కార్యాలయ సమయం ముగిసి, అధికారులు వెళ్లిపోయిన తర్వాత గోప్యంగా ఈ నియామక ప్రక్రియ చేపట్టడం చర్చనీయాంశమైంది. అయితే, వర్సిటీ నిబంధనల ప్రకారం రెక్టర్‌ను తొలగించాలంటే, వర్సిటీ ఈసీ ఆమోదం తప్పనిసరి అయినా, వీసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. కాలేజీల అఫిలియేషన్లు, అడ్మిషన్లు కొనసాగుతున్న సమయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు సైతం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కీలక మార్పులు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.