విడుదలైన ఖైదీలకు జాబ్‌మేళా

విడుదలైన ఖైదీలకు జాబ్‌మేళా

జైళ్ల శాఖ సంస్కరణలు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. కొత్త పంథాను ఎంచుకొని ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్షణికావేశంలో చేసిన తప్పులకు శిక్షను అనుభవించి విడుదలైన ఖైదీల్లో సంతోషం నింపాలని నిర్ణయించింది. వారిలోని అర్హత, నైపుణ్యం తదితర వాటిని పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు ఇవ్వాలనుకుంది. నిరుద్యోగులకు జాబ్‌మేళా నిర్వహించినట్లుగానే… విడుదలైన ఖైదీలకు జాబ్‌మేళా నిర్వహించనుంది.

ఈ నెల 22న హైదరాబాద్ డీజీ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి జిల్లా జైలు, సిద్దిపేట, జోగిపేట, మెదక్ సబ్‌జైళ్లలో శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీల కోసం జాబ్‌మేళాను ఏర్పాటు చేయనుంది.

జాబ్‌మేళాలో పాల్గొనాలనుకునే వారికి ఈ నెల 15 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు ఫారంలో దరఖాస్తుదారుని పూర్తి పేరు, అడ్రస్, వయస్సు, స్త్రీ/పురుషులు, ఫోన్ నంబరు, విద్యార్హత, ఆయా వృత్తుల్లో నైపుణ్యత దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. ఎలాంటి ఉద్యోగం కావాలో.. నెల జీతం ఎంత ఉండాలో దరఖాస్తులో తప్పకుండా తెలపాలి. తర్వాత సంగారెడ్డి జిల్లా జైలు కానీ, సిద్దిపేట, జోగిపేట, మెదక్ సబ్ జైళ్లలో దరఖాస్తు అందించాలి.