ఎస్ఆర్డీఎస్​లో 3,700 మందికి ఉద్యోగ భద్రత

ఎస్ఆర్డీఎస్​లో 3,700 మందికి ఉద్యోగ భద్రత
  • ప్రతిపాదనలు సిద్ధం చేయాలనిమంత్రి సీతక్క ఆదేశం
  • రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ 
  • ఎస్ఆర్డీఎస్​ బోర్డు డైరెక్టర్లతోమంత్రి సమావేశం 
  • పదేండ్ల పాటు బోర్డు మీటింగ్​ నిర్వహించకపోవడంపై విస్మయం 

హైదరాబాద్, వెలుగు: సొసైటీ ఫర్​ రూరల్​డెవలప్ మెంట్​సర్వీసెస్​ (ఎస్ఆర్డీఎస్) లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో  కొనసాగుతున్న 3,700 పైగా ఉద్యోగులకు జాబ్  సెక్యూరిటీ కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీ రాజ్  శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ఎస్ఆర్డీఎస్​లో టెక్నికల్  అసిస్టెంట్లు, కంప్యూటర్  ఆపరేటర్లు, ఆఫీసు సబార్డినేట్లు, ఇంజినీరింగ్  కన్సల్టెంట్లు వంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శనివారం సచివాలయంలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఎస్ఆర్డీఎస్​ బోర్డు డైరెక్టర్ల సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ పదేండ్ల పాటు బోర్డు మీటింగ్  నిర్వహించకపోవడంపై విస్మయం  వ్యక్తం చేశారు. 

మీటింగ్  నిర్వహించకపోతే ఉద్యోగుల సమస్యలు ఎలా తెలుస్తాయని ఆమె ప్రశ్నించారు. తమది ఎంప్లాయీస్  ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే యాక్టివ్ గా పనిచేయగలరని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలు నెరవేరుతాయన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రజలకు, ప్రభుత్వానికి ఆయువుపట్టు లాంటివని చెప్పారు. వీలైనంత మేర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబానికి కూడా భరోసా కల్పించేలా చర్యలు చేపడతామని ఆమె  హామీ ఇచ్చారు. ఉద్యోగికి ఏదైనా జరిగితే అతని కుటుంబానికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఎస్ఆర్డీఎస్​ ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగానే ప్రయోజనాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. 

ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకుంటామని, చిరుద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్డీఎస్​ బోర్డ్  ఆఫ్  డైరెక్టర్లు పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ లోకేష్  కుమార్, కమిషనర్  అనిత, స్పెషల్  కమిషనర్  షఫీ ఉల్లా, ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.