సీఎం రేవంత్ చొరవతో.. ఏపీ మహిళకు ఉద్యోగం

సీఎం రేవంత్ చొరవతో.. ఏపీ మహిళకు ఉద్యోగం
  • రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కానిస్టేబుల్ శేఖర్
  • నిబంధనలు సడలించి శేఖర్​ భార్యకు జాబ్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్
  • రాచకొండ సీపీ ఆఫీస్​లోజూనియర్ అసిస్టెంట్ జాబ్

ఉప్పల్, వెలుగు : విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదానికి గురైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా.. అతని భార్య సత్యలతకు సీఎం రేవంత్ ఉద్యోగం ఇచ్చారు. బీఆర్ఎస్ లీడర్లు, అధికారులను మూడేండ్లు వేడుకున్నా వాళ్లు పట్టించుకోలేదు. ఇటీవల ప్రజావాణిలో ఆమె దరఖాస్తు పెట్టుకోగా.. రేవంత్ స్పందించారు. నిబంధనలు సడలించి ఉద్యోగ అవకాశం కల్పించాల్సిందిగా డీజీపీ రవిగుప్తాను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ ఆఫీస్​లో జూనియర్ అసిస్టెంట్​గా నియమిస్తూ సీపీ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ ఆఫీస్​లో సత్యలతకు అపాయింట్​మెంట్ ఆర్డర్ అందజేశారు. 

ఉత్తర్వులు జారీ చేసిన రాచకొండ సీపీ

రాచకొండ పోలీస్ కమిషనరేట్​లోని అంబర్ పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్​ల్ సొంగా శేఖర్ కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తించేవాడు. 2021, సెప్టెంబర్ 30న విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని బీఆర్ఎస్ సర్కార్​ను సత్యలత వేడుకుంది. సత్యలత ఏపీకి చెందిన మహిళ కావడంతో.. స్థానికతను కారణంగా చూపుతూ జాబ్ ఇవ్వడానికి బీఆర్ఎస్ సర్కార్ నిరాకరించింది. లీడర్లు, అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ ప్రజావాణిలో ఆమె దరఖాస్తు పెట్టుకుంది. సీఎం రేవంత్​ను కలిసి వేడుకుంది. పూర్తి వివరాలు తెలుసుకున్న రేవంత్..

మానవతా దృక్పథంతో స్పందించారు. నిబంధనలు సడలించి సత్యలతకు జాబ్ ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు రాచకొండ సీపీ ఆఫీస్​లో సత్యలతను జూనియర్ అసిస్టెంట్​గా నియమిస్తూ సీపీ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేసి.. అపాయింట్​మెంట్ ఆర్డర్ అందజేశారు. భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సుధీర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్, డీజీపీ రవి గుప్తా, సీపీ సుధీర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.