రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు 1,91,126.. పీఆర్సీ రిపోర్ట్‌‌లో వెల్లడి

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు 1,91,126.. పీఆర్సీ రిపోర్ట్‌‌లో వెల్లడి
  • రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు 1,91,126
  • శాంక్షన్డ్​ పోస్టులు 4,91,304.. పనిచేస్తున్న ఉద్యోగులు 3,00,178
  • కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 1,08,528
  • వీరిని కలుపుకున్నా ఇంకా 16.81% పోస్టులు ఖాళీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా 91 వేల 126 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అన్ని డిపార్ట్ మెంట్లలో కలిపి మొత్తం 4 లక్షల 91 వేల 304 శాంక్షన్డ్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 3 లక్షల 178 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని పీఆర్​సీ తన రిపోర్టులో పేర్కొంది. రిపోర్టులో వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం శాంక్షన్డ్ పోస్టుల్లో 39 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయని లెక్క తేలింది. ఈ 39 శాతం ఖాళీల్లో లక్షా 8 వేల 528 మందిని ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌, కాంట్రాక్ట్‌‌‌‌ పద్ధతిలో పని చేయిస్తున్నారని వెల్లడైంది. ఈ పోస్టులను పక్కన పెట్టినా.. ఇంకా 16.81 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయని లెక్క తేల్చారు.

శాఖలవారీగా ఖాళీలు ఇలా..

అత్యధికంగా స్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌ మెంట్‌‌‌‌లో 1,37,651 శాంక్షన్డ్ పోస్టులుండగా, 1,13,853 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆ తర్వాత హోంశాఖలో 98,394 మంజూరు పోస్టులుండగా, 61,212 మంది ఉద్యోగులు ఉన్నారు. హెల్త్‌‌‌‌, మెడికల్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌లో 52,906 పోస్టులుండగా, 22,336 మంది పని చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్‌‌‌‌ మెంట్‌‌‌‌లో 27,786 పోస్టులకు 19,825 మంది, పంచాయతీరాజ్‌‌‌‌, రూరల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌లో 26,201 శాంక్షన్డ్ పోస్టులకు 13,573 మంది ఉన్నారు. మొత్తం ఈ ఐదు డిపార్ట్‌‌‌‌ మెంట్లలో కలిపి 3,42,938 పోస్టులుండగా, 2,30,799 మంది ఎంప్లాయీస్‌‌‌‌ విధుల్లో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం శాంక్షన్డ్ పోస్టుల్లో 69.80 శాతం ఈ ఐదు విభాగాల్లో ఉండగా,  మొత్తం ఉద్యోగుల్లో 76.88 శాతం మంది ఉన్నారు.

జనం కష్టాలు పట్టించుకుంటలే..

ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే రాష్ట్రంలోని పలు డిపార్ట్‌‌‌‌ మెంట్లు సరిగ్గా పట్టించుకోవడం లేదని పీఆర్సీ రిపోర్ట్ పేర్కొంది. ముఖ్యంగా రెవెన్యూ, హోం, ఎంఏయూడీ, పీఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ ఆర్డీ డిపార్ట్‌‌‌‌ మెంట్‌‌‌‌లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని తెలిపింది. పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్‌‌‌‌ ల లెవల్‌‌‌‌లో కూడా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని స్పష్టం చేసింది. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌ సిస్టంను మెరుగుపరచడానికి వీటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ విషయంపై ఉద్యోగులు విజ్ఞప్తులు, వివరణలు కూడా ఇచ్చారని పేర్కొంది.