దవాఖాన్లలో ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు?

దవాఖాన్లలో ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు?

హైదరాబాద్‌, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో ఉద్యోగాల భర్తీకి మోక్షం లభించడం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్‌పై ఒత్తిడి చేసుడు తప్పితే, ఖాళీలను నింపి మెరుగైన సేవలు అందించే దిశగా సర్కార్ చర్యలు తీసుకోవడం లేదు. అన్ని దవాఖాన్లలో కలిపి 12,735 ఖాళీలు ఉన్నాయని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వమే ప్రకటించింది. కానీ, నేటికీ ఇందులో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. దసరా నాటికే పూర్తవ్వాల్సిన ఎంబీబీఎస్ డాక్టర్ల రిక్రూట్‌మెంట్‌ నెల రోజులుగా ముందుకు కదలడం లేదు. కోర్టు కేసులతో మల్టీ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీ మధ్యలోనే ఆగిపోయింది. భారీ సంఖ్యలో స్టాఫ్ నర్స్ పోస్టులు ఖాళీలున్నా ఎటువంటి చలనం లేదు. ఇంకో వారం రోజుల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నప్పటికీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్ ఊసే ఎత్తడం లేదు. ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, హెల్త్ అసిస్టెంట్ వంటి కీలకమైన పోస్టులు వందల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇస్తరోనని లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

దసరా పాయే.. దీపావళి ఐపాయే
రిటైర్‌‌మెంట్లు, సర్దుబాట్లు, ఇన్‌ సర్వీస్ పీజీ కోటాతో వందల మంది డాక్టర్లు ప్రైమరీ హెల్త్ సెంటర్లను వీడారు. సుమారు 1,369 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 550 మంది మాత్రమే ఉన్నారు. డాక్టర్ల భర్తీకి సంబంధించి ఇప్పటికే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. దసరా నాటికే ఈ రిక్రూట్‌మెంట్ పూర్తవుతుందని, కొత్త డాక్టర్లు ఉద్యోగాల్లోకి వస్తారని మంత్రి హరీశ్‌రావు ప్రకటిస్తూ వచ్చారు. కానీ, దీపావళి ఐపోయినా ఇప్పటివరకూ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. 4,030 పోస్టుల్లో, 2,659 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 

సార్లు లేకుండానే క్లాసులు!
ఇంకో పది రోజుల్లో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభమవనున్నాయి. ఈసారి 8 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి. కాలేజీలు తెచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. అందులో ఖాళీలను నింపడం మర్చిపోయింది. అన్ని కాలేజీల్లో కలిపి 1,183 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి గాక 357 ట్యూటర్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కూడా సరిపడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ స్టూడెంట్లకు నాణ్యమైన విద్యను అందించడం, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే హాస్పిటళ్లకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎట్లా సాధ్యమవుతుందని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

ఒక్కరితోనే ముగ్గురి పని
ప్రభుత్వ దవాఖాన్లలో ప్రతి 3 నర్సింగ్ పోస్టుల్లో 2 ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల ముగ్గురు నర్సులు చేయాల్సిన పనిని ఒక్కరితోనే చేయిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా వంటి టీచింగ్ హాస్పిటళ్లలోనే 3,823 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా, ఏరియా హాస్పిటల్స్‌లో మరో 1,100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో భారమంతా ఉన్నవాళ్లపైనే పడుతోంది. నర్సింగ్ పోస్టుల భర్తీ బాధ్యతను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డుకు అప్పగిస్తూ మార్చిలోనే జీఓ జారీ అయింది. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. కానీ, ఇప్పటివరకూ రిక్రూట్‌మెంట్ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. 
పడకేసిన పల్లె దవాఖానలు
రాష్ట్రవ్యాప్తంగా 4,600 పల్లె దవాఖాన్లు పెడ్తున్నామని ప్రభుత్వం ప్రకటించి ఏడాదయింది. ఇప్పటివరకు కనీసం వెయ్యి దవాఖాన్లను కూడా ప్రారంభించలేదు. ప్రతి దవాఖానకు ఒక డాక్టర్‌‌ను నియమిస్తామని చెప్పి ఆ తర్వాత వెనక్కి తగ్గింది. సర్కార్ ఇచ్చే రూ.40 వేల వేతనానికి పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రావకపోవడంతో, డాక్టర్ల స్థానంలో స్టాఫ్ నర్సులను తీసుకోవాలని నిర్ణయించింది. రిక్రూట్‌మెంట్ బాధ్యతలను డీఎంహెచ్‌ఓలు, కలెక్టర్లకు అప్పగించింది. అన్ని జిల్లాల్లో కలిపి 800కు పైగా పోస్టులకు సుమారు 2 నెలల కింద నోటిఫికేషన్ ఇవ్వగా కోర్టు కేసులతో అది మధ్యలోనే ఆగిపోయింది. 

ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు
ఈ ఏడాది మార్చిలో ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన 12,735 పోస్టుల్లో సుమారు 3 వేలకుపైగా పారా మెడికల్ పోస్టులున్నాయి. చాలా ఏండ్ల తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు నోటిషికేషన్ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమవడంతో లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 7 నెలలైనా ఒక్క పోస్టుకూ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంకా 1,785 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్‌(ఫీమేల్) పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 475, ఫార్మాసిస్ట్​321, జూనియర్ అసిస్టెంట్ 218, అనస్తీషియా టెక్నీషియన్ 93, డెంటల్ టెక్నీషియన్ 53, రేడియోగ్రాఫర్ 55, డార్క్ రూమ్ అసిస్టెంట్ 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన కేడర్లలోనూ పదుల సంఖ్యలో ఖాళీలున్నాయి.  ఇకనైనా దవాఖాన్ల బాగుపై దృష్టి పెట్టాలని డాక్టర్లు కోరుతున్నారు.