
తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. శుక్రవారం ( అక్టోబర్ 17 ) అలిపిరి చెక్ పాయింట్ దగ్గర రెండవ ఘాట్ రోడ్డులో ప్రత్యక్షమైంది చిరుత. చిరుత దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారు స్థానికులు. తరచూ ఇదే ప్రాంతంలో చిరుత కదలికలు కనిపిస్తున్న క్రమంలో భయంతో వణికిపోతున్నారు జనం. చిరుతలు అలిపిరి చెక్ పాయింట్ దగ్గర నుంచి ఎస్వీ యూనివర్సిటీలోకి ప్రవేశిస్తున్నాయని చెబుతున్నారు స్థానికులు.
చిరుత సంచారం పట్ల నిఘా పెట్టారు ఫారెస్ట్ సిబ్బంది. అలిపిరి చెక్ పాయింట్, ఎస్వీ యూనివర్సిటీ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. తరచూ చిరుత సంచరిస్తున్న క్రమంలో భయబ్రాంతులకు గురవుతున్నామని అంటున్నారు స్థానికులు. టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది చిరుత సంచారంపై నిఘా పెట్టి తమను రక్షించాలని కోరుతున్నారు స్థానికులు.
ఇదిలా ఉండగా.. గతంలో అలిపిరి ఎస్వీ జూ పార్క్ రోడ్డులో బైక్ పై వెళ్తున్నవారిపై దాడికి యత్నించింది చిరుత. చిరుతను ముందే గమనించిన ప్రయాణికులు దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అటుగా కారులో వెళ్తున్నవారు చిరుత సంచరిస్తున్న దృశ్యాలను వీడియో తీశారు. వీడియోలో పొదల చాటున పొంచి ఉన్న చిరుత బైక్ పై వెళ్తున్నవారిపై ఒక్కసారిగా దాడికి యత్నించింది.
అయితే.. బైక్ స్పీడ్ గా వెళ్తుండటం వల్ల పులి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు ప్రయాణికులు. ఈ క్రమంలో బైకును ఢీకొన్న పులికి స్వల్ప గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొనడంతో కిందపడిపోయింది పులి. కొద్దిసేపటికి తేరుకున్న పులి పొదల్లోకి వెళ్ళింది. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.