
హైదరాబాద్ కి చెందిన శిశువైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ ఎనిమిదేళ్ల కృషి ఫలించింది. ఫ్రూట్ జ్యూస్ లు, ఎనర్జీ డ్రింక్ లకు ORS లేబుల్ వాడటాన్ని నిషేదించింది FSSAI. WHO ఆమోదించిన మెడికల్ ORS డ్రింక్స్ మాత్రమే ఆ లేబుల్ వాడాలని నిర్దారించింది. హానికరమైన షుగర్ డ్రింక్స్ నుంచి పిల్లలను కాపాడేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది FSSAI.
మార్కెట్లో ఫుడ్ ప్రొడక్టులను అమ్మే కంపెనీలు తమ ఫ్రూట్ జ్యూస్ లు, ఎనర్జీ డ్రింకులను ఓఆర్ఎస్ పేరుతో అమ్మరాదంటూ FSSAI నిషేధం విధించింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్ లు, ఎనర్జీ డ్రింకులపై ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్(ఓఆర్ఎస్) అనే పదాన్ని రాయొద్దని ప్రకటించింది.
వినియోగదారులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్న ఈ పద్ధతిని నిషేధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్ ప్రొడక్ట్ బ్రాండ్ పేరులో గానీ, ట్రేడ్ మార్క్ లో గానీ ఓఆర్ఎస్ అనే పదాన్ని వాడటం ఇకపై చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని బుధవారం జారీ చేసిన సర్క్యులర్ లో ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. డీహైడ్రేషన్ సమస్య నివారణ కోసం మార్కెట్లో ఓఆర్ఎస్ పేరుతో అనేక డ్రింకులు అందుబాటులో ఉన్నాయి.
అయితే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదించిన ఫార్ములాతో తయారైనదే అసలైన ఓఆర్ఎస్. కానీ మార్కెట్ లో అనేక ఆహార, పానీయాల తయారీ కంపెనీలు తమ పండ్ల రసాలు, రెడీ -టు -డ్రింక్ పానీయాలకు ఓఆర్ఎస్ అనే పదాన్ని ముందుగానీ, వెనుకగానీ తగిలించి అమ్ముతున్నాయి. దీనివల్ల వినియోగదారులు సాధారణ డ్రింకులను కూడా ఎమర్జెన్సీ వైద్యానికి వాడే ఓఆర్ఎస్ అని భ్రమపడి కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
పాత ఉత్తర్వులు రద్దు..
గతంలో ‘‘ఈ ప్రొడక్ట్ డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఓఆర్ఎస్ ఫార్ములా కాదు’’ అనే వార్నింగ్ తో బ్రాండ్ పేరులో ఓఆర్ఎస్ పదాన్ని వాడేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జులై 2022, ఫిబ్రవరి 2024లో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ హెచ్చరిక ఉన్నప్పటికీ వినియోగదారులు ఒరిజినల్ ఓఆర్ఎస్ అని భ్రమపడుతున్నారని గుర్తించడంతో, ఆ పాత ఉత్తర్వులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు తాజా ఆదేశాలలో స్పష్టం చేసింది.
ఎలాంటి షరతులు, హెచ్చరికలతో సంబంధం లేకుండా ఓఆర్ఎస్ పదాన్ని పూర్తిగా నిషేధించింది. ఇకపై తప్పుదోవ పట్టించే లేబులింగ్, యాడ్స్ ఇవ్వడం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం, 2006లోని సెక్షన్ 23, 24ను, అలాగే లేబులింగ్ అండ్ అడ్వర్టైజింగ్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పస్టం చేసింది. ఇది చట్టంలోని 52, 53 సెక్షన్ల ప్రకారం నేరమని హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లు, లైసెన్సింగ్ అధికారులు ఈ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.