
ఆసియా కప్ టీ20 టోర్నీ గెలుచుకుని ఫుల్ జోష్ లో కనిపించిన టీమిండియా ఇదే ఊపులో స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0 తో క్లీన్ స్వీప్ చేసింది. సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ కాంటినెంటల్ టోర్నీ తర్వాత వెస్టిండీస్ పై టెస్ట్ సిరీస్ గెలిచి ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ కు సిద్ధమవుతోంది. 2025 సంవత్సరం ముగియడానికి రెండు నెలల సమయం ఉంది. ఈ రెండు నెలల్లో టీమిండియా షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా టూర్:
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
సౌతాఫ్రికాతో మూడు ఫార్మాట్ లు:
నవంబర్- డిసెంబర్ నెలలో సౌతాఫ్రికా ఇండియాలో పర్యటిస్తుంది. మూడు ఫార్మాట్ లలో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ సుదీర్ఘ టూర్ లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్ న్యూఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో.. నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ జరుగుతుంది. నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతుంది.
తొలి మూడు వన్డేలకు వరుసగా రాంచీ, రాయ్‌పూర్,విశాఖపట్నం ఆతిధ్యమిస్తాయి. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9 న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14 న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. వన్డే మ్యాచ్ లో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు.. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.