
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున తన సినీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం కోసం గట్టిగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గాచర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయన చాలా జాగ్రత్తగా, గోప్యంగా పర్యవేక్షిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్కినేని అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రాజకీయ నేపథ్యం... ద్విపాత్రాభినయం!
నాగార్జున 100వ చిత్రానికి 'లాటరీ కింగ్' అనే పవర్ ఫుల్ టైటిల్ దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. ఈ కథ పూర్తిగా రాజకీయ నేపథ్యంలో, ప్రస్తుత సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. అందులో ఒక పాత్ర సామాన్య మధ్యతరగతి వ్యక్తిగా .. మరో పాత్ర శక్తివంతమైన, చతురత కలిగిన రాజకీయ నాయకుడిగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.ఈ రెండు పాత్రల మధ్య జరిగే సంఘర్షణే సినిమాకు ప్రధాన బలం అవుతుందని చెబుతున్నారు.
కీలక పాత్రలో అనుష్క శెట్టి
నాగార్జున 100వ సినిమాలో కీలక పాత్రలో అందాల తార అనుష్క శెట్టి నటించనున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సూపర్', 'డాన్', 'ఢమరుకం' వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. నాగార్జున, అనుష్క శెట్టి మధ్య ఉండే ప్రత్యేకమైన కెమిస్ట్రీని దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఆమెను సంప్రదించగా, కథ నచ్చడంతో అనుష్క సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. నాగార్జునకి జోడీగా కాకుండా, కథాగమనంలో ముఖ్యమైన మలుపు తిప్పే శక్తివంతమైన పాత్రను అనుష్క పోషిస్తారని అంచనా వేస్తున్నారు..
మెగాస్టార్ చిరంజీవి క్యామియో?
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారనే వార్త సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో ఒక స్టార్ హీరో క్యామియో ఇవ్వాలని భావిస్తున్నారట. ముఖ్యంగా, టాలీవుడ్ అగ్రశ్రేణి నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ బడా క్యామియో ఖరారైతే, అక్కినేని-మెగా అభిమానులకు ఇది నిజమైన పండగే అవుతుందని సినీ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.