
ఖాళీలున్నయ్ భర్తీ చేస్తం: కేటీఆర్
లాయర్ల రక్షణకు చట్టం తెస్తం
అడ్వకేట్ల హత్య వెనక ఉంది మా పార్టీ వాడేనని తెలియగానే సస్పెండ్ చేసినం
నేరస్తులను కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు:ఉద్యోగాలు పూర్తిగా నింపలేదని, ఇంకా ఖాళీలు ఉన్నాయని, వాటిని త్వరలోనే నింపుతామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటి వరకు 1లక్షా 33వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మేం మొత్తం నింపామని అనడం లేదు. ఇంకా ఖాళీలు ఉన్నాయి. వాటిని నింపాల్సిన అవసరం ఉంది. అది కూడా చేస్తం” అని అన్నారు. అలాగే ఈ ఆరేండ్లలో ప్రైవేటు కంపెనీల్లో 14 లక్షల ఉద్యోగాలు కల్పించగలిగామని చెప్పారు. నిరుద్యోగుల్లో రాష్ట్ర సర్కార్‌పై వ్యతిరేక ఉందనేది వాస్తవం కాదన్నారు.
హైకోర్టు అడ్వకేట్లు వామన్ రావు, నాగమణి హత్యపై కేటీఆర్ మాట్లాడుతూ “కొన్ని విషయాలు బాహటంగా మాట్లాడుకుంటనే బాగుంటుంది. ఈ ప్రభుత్వం వచ్చినంక లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉన్నం. ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించినం. అట్లాంటిది ఇలా నడిరోడ్డు మీద ఇద్దరు లాయర్లను చంపినప్పుడు అందరం బాధపడ్డాం. బాధపడి ఊరుకోలేదు. నిందితులను పట్టుకొమ్మని ఆదేశించినం. దాని వెనకాల ఉన్నవాడు మా పార్టీ వాడే. అది తెలియగానే పార్టీ నుంచి సస్పెండ్ చేసినం. వాళ్లను కఠినాతికఠినంగా శిక్షించే బాధ్యత మాది’’ అని అన్నారు. లాయర్ల రక్షణ కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దేశంలో ఇదివరకు ఎవరు చేసినా చేయకున్నా.. దేశానికే ఆదర్శమైన యాక్ట్ ను
తీసుకొస్తామని చెప్పారు.
కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ వచ్చిందనను..
2001లో కేసీఆర్ గులాబీ జెండా పడితేనే ఇయ్యాల తెలంగాణ కల సాకారమైంది. కేసీఆర్ ఒక్కరితోనే తెలంగాణ వచ్చిందనను, తెలంగాణలోని సబ్బండ వర్గాలు ఏకమై, ఆయన వెంట నడిస్తేనే అది సాధ్యమైంది. తెలంగాణ రాకుంటే టీ కాంగ్రెస్, టీ బీజేపీ లీడర్లను ఎవరైనా పట్టించుకునేవాళ్లా? మమ్మల్ని ఘోరంగా తిడుతున్న వాళ్లను కూడా క్షమిస్తున్నం. – కేటీఆర్