కియాతో 18 వేల మందికి జాబ్స్

కియాతో 18 వేల మందికి జాబ్స్

అమరావతి, వెలుగు:  కియా కార్ల సంస్థ ద్వారా ఆరున్నర వేల మందికి ఉపాధి లభిస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కియా ప్రాజెక్టు చివరి దశ పనులు పూర్తయితే 18 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. గురువారం అనంతపురం జిల్లా ఎర్రమంచి గ్రామం దగ్గర కియా కార్ల పరిశ్రమ నిర్వహించిన గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో సీఎం జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కియా సంస్థ ఉత్పత్తి పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకోవడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం  ఏడాదికి 70 వేల కార్ల ఉత్పత్తి ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు.  ప్లాంట్ లో కార్ల తయారీ ప్రాసెస్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశీయంగా కార్ల ఉత్పత్తిని కియా మోటార్స్ మరింత విస్తరించాలన్నారు. ఏటా 3 లక్షల కార్లు తయారు చేసే స్థాయికి పరిశ్రమ అభివృద్ధి చెందాలని, దీని కోసం  ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కియా కంపెనీ బాటలో మరిన్ని విదేశీ కంపెనీలు తరలి రావాలన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు తమ సర్కారు విస్తృత అవకాశాలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని, తమది ప్రొయాక్టివ్‌‌‌‌ ప్రభుత్వమని జగన్  అన్నారు. దక్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ రూ.13,500 కోట్లతో కార్ల ఉత్పత్తి ప్లాంట్ ను 2017లో ఏర్పాటు చేసింది.

నేడు ప్రధాని మోడీతో జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. జనవరి 26న అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని ఆహ్వానించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, రాజధాని అమరావతిపై ఆయనతో జగన్ చర్చిస్తారని తెలుస్తోంది.  మోడీతో భేటీ తర్వాత  కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జగన్ కలుస్తారు.