రాష్ట్రంలో కొలువులు ఇంకా రావాలె

రాష్ట్రంలో కొలువులు ఇంకా రావాలె
  • ‘వీ6-వెలుగు’తో టీఎస్‌‌పీఎస్సీ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి
  • ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలె
  • ఆరేండ్లలో అవినీతి ముద్ర లేకుండా పోస్టులు భర్తీ చేసినమని వెల్లడి 

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో ఉద్యోగాలు ఇంకా రావాల్సి ఉందని, ప్రస్తుతమున్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. శనివారం ‘వీ6–-వెలుగు’తో ఆయన మాట్లాడారు. ‘‘ప్రత్యేక రాష్ర్టం వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశ ఉండే. పోరాటాలతో తెలంగాణ వచ్చింది. కానీ ఉద్యోగాలు ఇంకా రావాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తే, మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశముంది’ అని చక్రపాణి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోందని, దేశంలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని తెలిపారు. రాష్ర్టంలోనూ నిరుద్యోగం ఉందని, దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు ఉండవని అన్నారు. రాష్ట్ర సర్కార్ మొత్తం 39వేల ఉద్యోగాల భర్తీకి టీఎస్పీపీఎస్సీకి అనుమతి ఇచ్చిందని చెప్పారు. వీటిలో రెండు వేల ఉద్యోగాలకు సంబంధించి ఇండెంట్లు, రోస్టర్ ఇవ్వలేదన్నారు. 36 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని.. వాటిలో 32 వేల పోస్టులు ఇప్పటికే భర్తీ చేశామని, మరో 4వేల పోస్టుల రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కూడా పూర్తయిందని చెప్పారు. ప్రభుత్వం టీఎస్పీఎస్సీతో పాటు మెడికల్, పోలీస్, గురుకుల తదితర బోర్డుల ద్వారా కూడా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసిందన్నారు.

98 శాతం సక్సెస్ సాధించినం..

టీఎస్పీఎస్సీ 98 శాతం సక్సెస్ రేట్ సాధించిందని చక్రపాణి అన్నారు. ఆరేండ్లలో అవినీతి ముద్ర లేకుండా పని చేసినందుకు సంతృప్తిగా ఉందన్నారు. టీఎస్పీఎస్సీలో10 మందితో కూడిన మంచి టీమ్ ఉండడం కలిసొచ్చిందన్నారు. అయితే 30 ఏండ్లు ప్రత్యక్ష ప్రజా జీవితంలో ఉన్న తనకు… ఈ బాధ్యతతో ఆరేండ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించినట్టు అయిందన్నారు. అయితే రాళ్లయినా, పువ్వులైనా చైర్మన్​పైనే పడతాయని చెప్పారు. టెన్షన్, ప్రెషర్​తో ఈ కాలం గడిచిందని తెలిపారు. టీఎస్పీఎస్సీని ఒక్కో మెట్టుగా నిర్మించి, దేశంలోనే ఆదర్శంగా నిలిపామని అన్నారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రవేశపెట్టి, అప్లికేషన్ ప్రాసెస్ ను ఈజీ చేశామన్నారు. ఇప్పటి వరకు 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.

చాన్స్ వస్తే యూపీఎస్సీకి వెళ్తా

యూపీఎస్సీ, ఏపీపీఎస్సీలో దేనికి అవకాశం వచ్చినా వెళ్తానని చక్రపాణి చెప్పారు. తాను పార్లమెంటరీ రాజకీయాలకు వ్యతిరేకమని, అవకాశం ఉన్నంత వరకు లెక్చరర్​గానే ఉంటానని తెలిపారు. ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్​లోకి వస్తానని వెల్లడించారు. ప్రజలకు రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు.