జూన్ 2న ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి.. లేదంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం

జూన్ 2న ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి..    లేదంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
  •     ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేనిపక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. జాబ్ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన మంగళవారం విద్యానగర్ బీసీ భవన్​లో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థి నిరుద్యోగుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో 18 వేలు, విద్యాశాఖలో 30 వేలు, గ్రూప్స్, యూనివర్సిటీలు, విద్యుత్ శాఖల్లో వేలాది ఖాళీలు ఉన్నా భర్తీ చేయడం లేదని, దీనివల్ల గెస్ట్, అవుట్​సోర్సింగ్ ఉద్యోగులతోనే వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. 

ప్రభుత్వం వెంటనే ఖాళీలను సేకరించి నోటిఫికేషన్లు జారీ చేయాలని, లేకపోతే జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో విద్యార్థి, నిరుద్యోగ నాయకులు రాజేందర్, నిఖిల్ పటేల్, అంజి గౌడ్ పాల్గొన్నారు.