50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తాం

50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తాం

హైదరాబాద్: ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. శుక్రవారం ఆయన.. టీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇన్‌చార్జీలు, నాయకులు, పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 1,33,000 ఉద్యోగాలిచ్చామని తెలిపారు. మరో 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నామని తెలిపారు కేటీఆర్.

టీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి నాయకత్వంలో  హైదరాబాద్ నగరం గత ఏడు సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన నగర అభివృద్ధిని నగర విద్యావంతుల దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఒక్క ఓటర్ ని నేరుగా కలిసి టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు మంత్రి కేటీఆర్.