మహారాష్ట్రలో ఓటర్ల జాబితా లొల్లి..'ఫారం 6' మార్పునకు సీఈవో ప్రతిపాదన

మహారాష్ట్రలో ఓటర్ల జాబితా లొల్లి..'ఫారం 6' మార్పునకు సీఈవో ప్రతిపాదన
  • తొలగించిన పేర్లపునరుద్ధరణకు ఈసీఐకి విజ్ఞప్తి

ముంబై : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా పేర్లు తొలగించబడిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా 'ఫారం-6'లో మార్పులు చేయాలని మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ) కోరారు. గత వారం ఈసీకి పంపిన ఈ ప్రతిపాదన ద్వారా పాత ఓటర్ల ఆందోళనలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సాధారణంగా కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారే 'ఫారం-6' వాడాలి. కానీ సర్​సమయంలో జాబితా నుంచి తొలగించబడిన పాత ఓటర్లు కూడా ఇదే ఫారం ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఈసీ సూచించింది.

కానీ, ఇందులో తాము తొలిసారి ఓటరుగా దరఖాస్తు చేసుకుంటున్నట్లు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండడంతో ఓటర్లలో గందరగోళం తలెత్తింది. ఇది తప్పుడు ప్రకటన కిందకు వస్తుందేమోనని, 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమవుతుందని భయపడి చాలామంది ముందుకు రావడం లేదు. అధికారులకు కూడా వీళ్లను ఒప్పించడం కష్టంగా మారింది.

మూడు కీలక మార్పులకు సిఫార్సు

ఈ సమస్యను పరిష్కరించేందుకు మహారాష్ట్ర సీఈవో మూడు కీలక మార్పులను సిఫార్సు చేశారు. ఫారం-6 శీర్షిక నుంచి 'కొత్త ఓటర్లు' అనే పదాలను తొలగించడం, గతంలో నమోదైన వారి కోసం ప్రత్యేక ప్రత్యామ్నాయ డిక్లరేషన్‌‌‌‌ను చేర్చడం, పాత వివరాలను ట్రేస్ చేయడానికి వీలుగా పాత ఎపిక్ (ఈపీఐసీ) నంబర్ ఇచ్చే ఆప్షన్ కల్పించడం ఉన్నాయి. రాష్ట్రంలో క్లెయిమ్‌‌‌‌లు, అభ్యంతరాల గడువు అక్టోబర్ 26తో ముగియనుండగా, తుది ఓటర్ల జాబితా నవంబర్ 16న విడుదల కానుంది. ఈ లోపు ఈసీ ఆమోదం లభిస్తే ఓటర్లకు ఎదురుచూపులు తప్పుతాయి.