- ఓపెనింగ్ సెర్మనీలో భారతీయ సంస్కృతిని చాటిచెప్పిన అథ్లెట్లు
- ఫ్లాగ్ బేరర్లుగా సిమ్రన్ శర్మ, ప్రమోద్ భగత్
నగోయా: పారా ఆసియా గేమ్స్ జపాన్‌లోని నగోయాలో ఆదివారం అత్యంత అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ‘ఇమేజిన్ వన్ హార్ట్’ అనే నినాదంతో ప్రారంభమైన ఓపెనింగ్ సెర్మనీలో 45 దేశాలకు చెందిన సుమారు 3,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ పరేడ్‌లో భారత ఇండియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దాదాపు 5వేల సంవత్సరాల ఘనమైన భారతీయ సంస్కృతి, ప్రాచీన నాగరికతను ప్రతిబింబించే ప్రత్యేక మోటీఫ్‌లు, డిజైన్లతో కూడిన సెరిమోనియల్ బ్లేజర్లను ధరించి వారు మైదానంలోకి అడుగుపెట్టారు. 100 మందికిపైగా ఇండియన్ అథ్లెట్లు ఈ పరేడ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పారాలింపిక్ పతక విజేత, స్టార్ స్ప్రింటర్ సిమ్రన్ శర్మతో పాటు అగ్రశ్రేణి పారా షట్లర్ ప్రమోద్ భగత్ ఇండియన్ టీమ్‌కు ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు.
పతకాలే లక్ష్యంగా భారీ బృందం
ఈ గేమ్స్ కోసం భారత్ మొత్తం 281 మంది సభ్యుల బృందాన్ని పంపగా, అందులో 168 మంది అథ్లెట్లు ఉన్నారు. వీరంతా వివిధ క్రీడా విభాగాల్లో దేశం తరఫున పతకాల కోసం పోటీ పడనున్నారు. ఈ పోటీలు అక్టోబర్ 24 వరకు జరుగనున్నాయి. గతంలో చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన 2023 పారా ఆసియా గేమ్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలతో మొత్తం 111 పతకాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. ఈసారి కూడా అదే ఊపును కొనసాగిస్తూ తమ పాత రికార్డును తిరగరాయాలని మన అథ్లెట్లు పట్టుదలతో ఉన్నారు.
మెడల్స్ వేటలో నిషాద్, అవని
2026 ఆసియా పారా గేమ్స్‌లో భారత్ తన పతకాల వేటను ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. పారా అథ్లెటిక్స్, పారా స్విమ్మింగ్, పారా పవర్‌లిఫ్టింగ్, పారా ఆర్చరీ, పారా షూటింగ్ విభాగాలలో పలువురు ప్రముఖ అథ్లెట్లు దేశం తరఫున బరిలోకి దిగుతున్నారు. పారాలింపిక్ పతక విజేతలు నిషాద్ కుమార్, అజిత్ సింగ్ యాదవ్, ప్రపంచ ఛాంపియన్ రింకూ హుడా భారత్ తరఫున ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. కాంటినెంటల్ మల్టీ-స్పోర్ట్ ఈవెంట్ ప్రారంభంలోనే భారత్ పతకాల ఖాతా తెరిచేందుకు ఈ అథ్లెట్లపై భారీ అంచనాలున్నాయి.
అలాగే పారా స్విమ్మింగ్, పారా పవర్లిఫ్టింగ్లలో కూడా భారత క్రీడాకారులు పతకాలే లక్ష్యంగా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. పారా ఆర్చరీలో అనుభవజ్ఞులైన హర్విందర్ సింగ్, శీతల్ దేవిలతో పాటు పాయల్ నాగ్ కూడా తమ పోరును ప్రారంభించనున్నారు. ప్రెసిషన్-బేస్డ్ విభాగమైన ఆర్చరీలో భారత్ విజయం సాధించేందుకు ఈ క్రీడాకారులు బలమైన ప్రదర్శన కనబరచాలని చూస్తున్నారు. మరోవైపు, పారా షూటింగ్ విభాగంలో టోక్యో, పారిస్ పారాలింపిక్స్ విజేత అవని లేఖర బరిలోకి దిగి దేశం పతకాల జాబితాను మరింత పెంచేందుకు ప్రయత్నించనున్నారు.
