బతుకమ్మను మిస్ అవుతున్న..పీవీ సింధు ఎమోషనల్ పోస్ట్

బతుకమ్మను మిస్ అవుతున్న..పీవీ సింధు ఎమోషనల్ పోస్ట్
  •     ప్రస్తుతం డెన్మార్క్ లో ఉన్న బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్

కోపెన్‌హాగన్: టోర్నీ షెడ్యూల్ కారణంగా ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను మిస్ అవుతున్నట్లు బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఎమోషనల్​పోస్ట్​ పెట్టింది. భర్తతో కలిసి గతేడాది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. బతుకమ్మ కలర్స్, ఫ్లవర్స్ ను మిస్ అవుతున్నట్లు రాసుకొచ్చింది. అయితే, వెండి బతుకమ్మను పట్టుకుని ఉన్న సింధు ఫొటోపై ఓ నెటిజన్ విమర్శలు చేశాడు. ‘పూలు పేర్చితే బతుకమ్మ అంటారు... మీ పైత్యాన్ని పండుగపై రుద్దకండి’ అంటూ చేసిన కామెంట్‌పై స్పందించిన సింధు.. తనదైన శైలిలో అతడికి కౌంటర్ ఇచ్చింది.‘దయచేసి ఎదుటి వ్యక్తులపై ఓ అభిప్రాయానికి వచ్చే ముందు ఈ సంప్రదాయాన్ని అర్థం చేసుకోండి.. మా పుట్టింటి వైపు బతుకమ్మ పండుగను జరుపుకునే సంప్రదాయం లేదు. 

కాబట్టి ఇది నాకు నా జీవితంలోనే మొట్టమొదటి బతుకమ్మ! నా వివాహం తెలంగాణకు నడిబొడ్డున ఉన్న కరీంనగర్‌కు చెందిన కుటుంబంలో జరిగింది.. వెనుక కనిపించే పెద్ద పూల బతుకమ్మ చూశారా? రోజంతా సమయం వెచ్చించి, ఎంతో ఇష్టంగా దాన్ని నేనే స్వయంగా పేర్చాను.. దాంతోనే మేము పండుగ జరుపుకున్నాం. ఇక ఈ వెండి బతుకమ్మ..  మనసుకు దగ్గరైన ఈ సంప్రదాయంలోకి నన్ను ఆత్మీయంగా ఆహ్వానించడానికి మా అత్తయ్య చూపించిన ప్రేమకు నిదర్శనం.. కచ్చితంగా, సంప్రదాయంతో పాటు ఒక అమ్మ ప్రేమకు ఎప్పుడూ చోటు ఉంటుంది!’అని సింధు సమాధానం ఇచ్చింది. కాగా.. డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 ఆడేందుకు వెళ్లిన ఆమె ప్రస్తుతం విదేశాల్లో ఉంది.