భారత్ తో దోస్తీ మరింత పటిష్టం

భారత్ తో దోస్తీ మరింత పటిష్టం

 

  •     ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో జో బైడెన్
  •     చైనాతో పోటీ పడతాం..గొడవలు పెట్టుకోం
  •     ట్రంప్ పగతోనే ఎన్నికల బరిలోకి దిగారని కామెంట్

వాషింగ్టన్ :  అమెరికాకు ఇండియా మంచి భాగస్వామి అని, ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా ఆర్థిక విధానాలు అసంబద్ధంగా ఉన్నాయని విమర్శించారు. తైవాన్​తో గొడవ పెట్టుకుని.. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నదని మండిపడ్డారు. గురువారం అమెరికా కాంగ్రెస్ లో  ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో భాగంగా తమ ప్రభుత్వ విధానాలను బైడెన్ ప్రకటించారు. ‘‘అమెరికాకు ఇండియా మంచి మిత్ర దేశంగా ఉంది. ఆస్ట్రేలియా, జపాన్‌‌‌‌‌‌‌‌, సౌత్​ కొరియాతో కూడా అమెరికాకు మంచి సంబంధాలున్నాయి. మా దేశ పునరుజ్జీవంలో ఇవి కీలక పాత్ర పోషిస్తుంటాయి. చైనాతో మేము పోటీ పడాలనుకుంటున్నాం... గొడవలు పెట్టుకోం. ఆర్థికంగా అమెరికా వెనుకబడుతున్నదని.. చైనా దూసుకుపోతున్నదని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ సభ్యులు అంటున్నారు. ఇందులో నిజం లేదు. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం అమెరికానే.. ఇందులో ఎలాంటి డౌట్ లేదు’’అని బైడెన్ స్పష్టం చేశారు. 

పుతిన్​కు వంగి వంగి దండాలు పెడ్తున్నరు

ఉక్రెయిన్​తో యుద్ధానికి దిగి వేలాది మంది అమాయకుల మరణాలకు కారణమైన రష్యా అధ్యక్షుడు పుతిన్​కు కొందరు వంగి వంగి దండాలు పెడ్తున్నారని ట్రంప్​ను ఉద్దేశిస్తూ బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి’ అంటూ పుతిన్​కు ట్రంప్ అండగా నిలిచారని మండిపడ్డారు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదన్నారు. పగ, ప్రతీకారంతో ట్రంప్ ఎన్నికల బరిలోకి దిగుతున్నాడని విమర్శించారు. ఈ వైఖరి అమెరికాతో పాటు యావత్ ప్రపంచానికి ఎంతో ప్రమాదకరమన్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ను ఓడించాలని బైడెన్ కోరారు. అందరినీ గౌరవించాలని, సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. తన పాలనలో ద్వేషానికి ఎక్కడా స్థానం లేదని స్పష్టం చేశారు.