ఢిల్లీకి బైడెన్​.. రేపటి నుంచి జీ20 సమిట్​

ఢిల్లీకి బైడెన్​.. రేపటి నుంచి జీ20 సమిట్​

వాషింగ్టన్: జీ20 సమిట్​కు ఢిల్లీ సిద్ధమైంది. ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాలకు ప్రపంచ దేశాధినేతలు వస్తుండడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సమిట్ జరిగే ప్రాంతమంతా భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. నోరూరించే సంప్రదాయ వంటలను అతిథులకు రుచి చూపించబోతున్నది. అలాగే, గెస్ట్​లు బస చేసే హోటల్స్​లో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ క్రమంలో అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన బస చేసే ఐటీసీ మౌర్య షెర్టాన్ హోటల్ ను అమెరికన్ సీక్రెట్ సర్వీసెస్ అధికారులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

బైడెన్ భార్య జిల్ బైడెన్​కు కరోనా పాజిటివ్ రావడంతో.. ప్రెసిడెంట్ జో బైడెన్, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కరోనా గైడ్​లైన్స్ ఫాలో అవుతారని వైట్​హౌస్ అధికారులు ప్రకటించారు. సోమవారం, మంగళవారం జో బైడెన్​కు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చిందని, ఫ్లైట్ ఎక్కే ముందు కూడా పరీక్ష చేస్తామని వివరించారు. ఇండియా వెళ్లేందుకు ఆయన అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. బైడెన్​తో వెళ్లే ప్రతినిధుల బృందంలోని ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. జీ20 సమిట్​లో బైడెన్ మాస్క్ పెట్టుకునే 
కనిపించనున్నారు. 

రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్​పై చర్చించే చాన్స్

శుక్రవారం సాయంత్రం బైడెన్ ఇండియాకు చేరుకున్న తర్వాత రాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. జీ20 సమిట్​లో భాగంగా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులతో కూడా భేటీ అవుతారు. వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, తదితర అంశాలపై చర్చిస్తారు. జీ20 సమిట్​కు మోదీ నాయకత్వంలోని ఇండియా లీడ్ చేయడంపై వైట్​హౌస్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలన్నీ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీకి మారడంపై కూడా మోదీ, బైడెన్ చర్చించనున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రభావితమైన లో అండ్ మిడిల్ ఇన్​కమ్ దేశాల ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుకుంటారు. అదేవిధంగా, ఇండో పసిఫిక్ సెక్యూరిటీ, ఆర్థిక, దౌత్యపరమైన సవాళ్లపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. శుక్రవారం రాత్రే మోదీతో బైడెన్ భేటీ అవుతారని, దీనిపై ఇండియన్ అఫీషియల్స్ నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉందని వైట్​హౌస్ అధికారులు తెలిపారు.

బైడెన్​కు మూడంచెల భద్రత

జో బైడెన్ శుక్రవారం రాత్రి 7 గంట‌‌లకు ఢిల్లీకి చేరుకుంటారు. దీంతో కేంద్ర హోంశాఖ మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. ‘ది బీస్ట్’ కారులో బైడెన్ ట్రావెల్ చేయనున్నారు. ఈ కారు బోయింగ్ సీ-17 విమానంలో యూఎస్ నుంచి ఢిల్లీకి చేరుకోనుంది. మూడో లేయర్​లో ఇండియన్ పారామిలిటరీ ఫోర్స్ సిబ్బంది ఉంటారు. సెకండ్ లేయర్​లో ఇండియన్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్​పీజీ)కు చెందిన కమాండోలు ఉంటారు. లోపలి సర్కిల్‌‌లో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఉంటారు. ఐటీసీ మౌర్య షెర్టాన్ హోటల్​లో బైడెన్ బస చేయనున్నారు. ఇప్పటికే భద్రతా బలగాలు హోటల్​ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హోటల్ మొత్తాన్ని తనిఖీ చేస్తున్నారు. 14వ ఫ్లోర్​లో బైడెన్ ఉంటారు. డైరెక్ట్​ 14వ ఫ్లోర్​కు వెళ్లేందుకు బైడెన్ కోసం స్పెషల్ లిఫ్ట్​ ఏర్పాటు చేశారు. స్పెషల్ పాస్​లు ఉన్నవారికి మాత్రమే 14వ ఫ్లోర్ ఎంట్రీ ఉండనుంది. హోటల్​లో మొత్తం 400 రూమ్​లు బుక్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన బుల్లెట్ ప్రూఫ్ ‘ది బీస్ట్’ కారు యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ నిఘాలో ఉంటుంది. ఇండియన్ ఎయిర్​ఫోర్స్, ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్లు హోటల్​పై గస్తీ 
కాస్తుంటాయి.

ఎవరు.. ఎప్పుడు వస్తారంటే..

బ్రిటన్, కెనడా, జపాన్ తో పాటు పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు శుక్రవారం ఢిల్లీ చేరుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఢిల్లీ చేరుకుంటారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఫ్లైట్ మధ్యాహ్నం 2.15 గంటలకు పాలెం ఎయిర్​ఫోర్స్ స్టేషన్​లో ల్యాండ్ కానుంది. ఇక, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో సాయంత్రం 7 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. చైనా ప్రధాని లి కియాంగ్ బృందం రాత్రి 7.45 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో పాటు పలు దేశాల అధినేతలు శుక్రవారం రాత్రికల్లా ఢిల్లీ చేరుకుంటారు.