
క్రికెట్ లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. క్రికెట్ లో తొలి మ్యాచ్ నుంచి వీరి మధ్య సమరం ఇప్పటికీ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. నవంబర్ 21 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఈ మెగా సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పై భారీ అంచనాలున్నాయి. ఇంగ్లాండ్ యాషెస్ గెలవాలంటే రూట్ బ్యాటింగ్ చాలా కీలకం. అయితే ఆస్ట్రేలియాలో రూట్ కు మాత్రం మంచి రికార్డ్ లేదు. టెస్ట్ కెరీర్ లో 39 సెంచరీలు ఉన్న రూట్ కు ఆస్ట్రేలియాలో ఒక్క సెంచరీ కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్న రూట్.. రానున్న యాషెస్ లో సెంచరీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. స్కై స్పోర్ట్స్‌తో రూట్ మాట్లాడుతూ.. "నేను చివరిసారిగా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు నాకు కెప్టెన్సీ బాధ్యత ఉంది. కొన్ని సంవత్సరాలుగా సూపర్ ఫామ్ లో ఉండడం సంతోషాన్నిస్తుంది. గత రెండేళ్లలో చాల అనుభవం వచ్చింది. సీనియర్ ఆటగాడిగా నా మునుపటి పర్యటనల నుండి నేను మంచి పాఠాలు నేర్చుకున్నాను. ఆస్ట్రేలియాలో నాకు సెంచరీ లేదనే చర్చ జరుగుతుంది. కానీ నేను సెంచరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను". అని ఈ ఇంగ్లాండ్ స్టార్ తెలిపాడు.
నగ్నంగా నడుస్తానని హేడెన్ ఛాలెంజ్:
యాషెస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఒక విచిత్రమైన బెట్ వేశాడు. ఈ బెట్ ఎవరో గెలుస్తారో కాదు.. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ పై. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న రూట్ రానున్న యాషెస్ సిరీస్ లో సెంచరీ చేయకపోతే తాను మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో నగ్నంగా నడుస్తానని బోల్డ్ కామెంట్స్ చేశాడు. హేడెన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. అతని స్టేట్ మెంట్ కు నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
ఆస్ట్రేలియాలో సెంచరీ లేదు:
టెస్ట్ క్రికెట్ కెరీర్ లో ఇప్పటివరకు 39 సెంచరీలు చేసిన రూట్.. ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం ఆశ్చర్యకరం. కేవలం టెస్టుల్లోనే కాదు ఆస్ట్రేలియాలో వన్డే, టీ20ల్లోనూఈ ఇంగ్లాండ్ స్టార్ కు శతకం లేదు. ఇప్పటివరకు 14 మ్యాచ్ ల్లో ఒక్క సెంచరీ కూడా లేదు. రూట్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియాపై నాలుగు సెంచరీలు చేశాడు. ఈ నాలుగు సెంచరీలు ఇంగ్లాండ్‌లోనే చేశాడు. 34 ఏళ్ల రూట్ ఓవరాల్ గా ఆస్ట్రేలియాపై 34 టెస్టుల్లో 40.46 యావరేజ్ తో 2428 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.