
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రెండవ వన్డేలో జో రూట్ సెంచరీతో చెలరేగాడు. ఆదివారం (జూన్ 1) కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 98 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్.. జట్టు విజయం కోసం పోరాడుతున్నాడు. ఈ క్రమంలో రూట్ ఇంగ్లాండ్ తరపున చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ తరపున వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్ గా అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ రికార్డ్ ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరిట ఉంది.
వన్డే ఫార్మాట్ లో మోర్గాన్ 6,957 పరుగులతో టాప్ లో ఉన్న రికార్డ్ ను రూట్ వెనక్కి నెట్టాడు. రూట్ తన వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనతను అందుకున్నాడు. ఇదే ఊపులో సెంచరీతో పాటు వన్డేల్లో 7000 పరుగుల క్లబ్ లో చేరాడు. ఇంగ్లాండ్ తరపున 7000 పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా రూట్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే టెస్టుల్లో రూట్ 13006 పరుగులతో ఇంగ్లాండ్ తరపున టాప్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్ లో 52 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న రూట్.. 98 బంతుల్లో తన వన్డే కెరీర్ లో 18 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రూట్ వన్డే కెరీర్ విషయానికి వస్తే 168 ఇన్నింగ్స్‌లలో 48.31 సగటుతో 6,958 పరుగులు చేశాడు. వీటిలో 18 సెంచరీలు.. 43 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 207 ఇన్నింగ్స్‌లలో 39.75 సగటుతో 6,957 పరుగులతో తన కెరీర్ ను ముగించాడు. ఓవరాల్ గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో రూట్ గ్రేమ్ స్మిత్ తర్వాత 48వ స్థానంలో ఉన్నాడు. భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక కుమార్ సంగక్కర 14,234 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసి వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌట్ అయింది. కీసీ కార్టీ 105 బంతుల్లో 13 ఫోర్లతో 103 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (59) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ప్రస్తుతం 33 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రూట్ (86), విల్ జాక్స్ (26) క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే చివరి 17 ఓవర్లలో 124 పరుగులు చేయాలి.