జోఫ్రా ఆర్చర్ ఝలక్.. పీకల్లోతు కష్టాల్లో సన్‌రైజర్స్

జోఫ్రా ఆర్చర్ ఝలక్.. పీకల్లోతు కష్టాల్లో సన్‌రైజర్స్

SRH vs RR: న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 'ఎలిమినేటర్' మ్యాచ్‌లో 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తీవ్ర ఒత్తిడిలో పడింది. రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీశాడు. రన్ రేట్ వేగంగానే ఉన్నప్పటికీ.. వరుసగా 5 కీలక వికెట్లు కోల్పోయి ఆరెంజ్ ఆర్మీ ప్రస్తుతం బిగ్ ట్రబుల్‌లో పడింది.

మొదటి ఓవర్లోనే హైడ్రామా: 
ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మైదానంలో హై-డ్రామా నడిచింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే సన్‌రైజర్స్ వికెట్ కోల్పోయింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఎదుర్కొన్న రెండో బంతికి డకౌట్ అయ్యాడు. వికెట్ పడినా సన్‌రైజర్స్ బ్యాటర్లు తగ్గేదేలేదన్నట్లు ఆడటంతో ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో 0, W (వికెట్), 2, 6, 4, 4 ఏకంగా 16 పరుగులు కొట్టేశారు.  

చెలరేగిన ఇషాన్ కిషన్: 
అభిషేక్ అవుట్ అయినా తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ రాజస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడుతూ ఊరమాస్ ఇన్నింగ్స్ ఆడాడు. నాండ్రే బర్గర్ వేసిన రెండో ఓవర్లో సన్‌రైజర్స్ బ్యాటర్లు 2, 4WD, 1, 0, 1, 6, 4లతో 19 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కేవలం 11 బంతుల్లోనే 33 పరుగులు చేసి సన్‌రైజర్స్ క్యాంప్‌లో జోష్ నింపాడు. కానీ, ప్రమాదకరంగా మారుతున్న కిషన్‌ను జోఫ్రా ఆర్చర్ మళ్లీ దెబ్బకొట్టాడు. ఆర్చర్ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి కిషన్ అవుట్ కావడంతో ఎస్ఆర్‌హెచ్ కోలుకోలేని దెబ్బతింది.  

పేకమేడలా కూలిన టాప్ ఆర్డర్: 
ఇషాన్ కిషన్ అవుట్ అయిన వెంటనే రాజస్థాన్ బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. సన్‌రైజర్స్ వరుస ఓవర్లలో వికెట్లు సమర్పించుకుంది. సెకండ్ డౌన్‌లో వచ్చిన స్మరణ్ రవిచంద్రన్‌ను నాండ్రే బర్గర్ పెవిలియన్ పంపాడు. కాగా సన్‌రైజర్స్ ఆశలన్నీ మోస్తున్న మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (17 పరుగులు) ను జోఫ్రా ఆర్చర్ తన అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కాటేరమ్మ కొడుకు కూడా పెద్దగా రాణించలేదు.. కేవలం 18 రన్స్ మాత్రమే చేసి యశ్ రాజ్ పుంజా బౌలింగ్ లో LBWగా వెనుదిరిగాడు. దీంతో 81 పరుగులకే ఆరెంజ్ ఆర్మీ కీలకమైన 5 వికెట్లని నష్టపోయి కష్టాల్లో పడింది.