వజ్రోత్సవ సంబరాలకు అంతా రెడీ

వజ్రోత్సవ సంబరాలకు అంతా రెడీ

హనుమకొండ, వెలుగు : స్వాతంత్ర భారత వజ్రోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా రెడీ అయింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆఫీసర్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఆజాదీకా అమృత్​ మహోత్సవ్​ లో భాగంగా వివిధ ఉత్సవాలు నిర్వహిస్తుండగా.. పంద్రాగస్టు వేడుకలను గ్రాండ్​ గా జరిపేందుకు సిద్ధమయ్యారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ప్రముఖులు చీఫ్​ గెస్ట్ గా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేయనున్నారు. హనుమకొండ జిల్లా ఉత్సవాలను పోలీస్​పరేడ్​గ్రౌండ్​లో నిర్వహించనుండగా.. చీఫ్​గెస్ట్​గా ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ హాజరుకానున్నారు. జనగామ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, మహబూబాబాద్​లో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ జిల్లాలో ప్రభుత్వ సలహాదారు జీఆర్​ రెడ్డి, జయశంకర్​ భూపాలపల్లిలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్​శర్మ, ములుగులో శాసనమండలి విప్​ ఎంఎస్​ ప్రభాకర్​రావు వేడుకల్లో పాల్గొననున్నారు. కాగా వర్షాల నేపథ్యంలో ఉత్సవాలకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆఫీసర్లు టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఓసిటీ గ్రౌండ్​లో వజ్రోత్సవాలు ప్రారంభం 
వరంగల్​ సిటీ, వెలుగు: వీరుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తూర్పు ఎమ్మెల్యే నరేందర్​, వరంగల్ జిల్లా కలెక్టర్​ గోపి అన్నారు. ఆదివారం రాత్రి ఓసిటీలోని గ్రౌండ్​లో 75వ స్వాతంత్ర్య వేడుకలను ప్రారంభించారు. ముందుగా ఓసిటీ గ్రౌండ్​లో జానపద కళా ప్రదర్శనను పటాకులు పేల్చి సంబురంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళా ప్రదర్శన చేసిన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులను కలెక్టర్​, ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ హరిసింగ్​, ఆర్డీవో మహేందర్​ జీ, కార్పొరేటర్లలు పాల్గొన్నారు.