ప్రముఖ కవి, జర్నలిస్ట్ దేవీప్రియ మృతి

ప్రముఖ కవి, జర్నలిస్ట్ దేవీప్రియ మృతి

ప్రముఖ కవి, జర్నలిస్టు దేవీప్రియ కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన తెలుగు సాహితీ లోకానికి ఎనలేని సేవ చేశారు. ఆయన మృతితో పలువురు కవులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దేవీప్రియ పార్థివదేహాన్ని సికింద్రాబాద్‌ ఆల్వాల్‌లోని ఆయన నివాసానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం తిరుమలగిరి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి.

దేవీప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15న జన్మించారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్, తండ్రి షేక్ హుస్సేన్ సాహెబ్, తల్లి షేక్ ఇమామ్ బీ. గుంటూరులోని ఏసీ కాలేజీలో బిఏ చదువుకున్నారు. సాహిత్యరంగంలో ఆయన దేవీప్రియగా ప్రసిద్ధి పొందారు. తన సాహిత్యాన్నంతా ఆయన దేవీప్రియ పేరుతో వెలువరించారు. కాలేజీ రోజుల్లోనే ఆయన సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు. గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబర కవులు బృందంలో ఆయన చేరారు. జర్నలిస్టుగా ఆయన ప్రజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, ఆంధ్రజ్యోతి, మనోరమ, ఉదయం, హైదరాబాద్ మిర్రర్ తదితర పత్రికల్లో పనిచేశారు. ఆయన రన్నింగ్ కామెంటరీ కార్టూన్ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడి సృష్టించింది. దేవీప్రియ రచించిన అమ్మచెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుఫాను తుమ్మెద, గరీబు గీతాలు, సమాజాంద స్వామి వంటి పలు రచనలు ఎంతో ప్రసిద్ధిచెందాయి. గాలి రంగు అనే గ్రంథానికి గాను ఆయనకు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

దేవీప్రియ మృతిపట్ల సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా దేవీప్రియ సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఎంతగానో కృషి చేశారని సీఎం అన్నారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు ‘గాలి రంగు’ రచన మచ్చుతునక అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

For More News..

దుబ్బాక పాయే.. జీహెచ్ఎంసీ వచ్చే.. అయినా పీఆర్సీ రాకపాయే

ఫోన్ వాడొద్దన్నందుకు.. ఉరి వేసుకుంది

టీఆర్ఎస్‌లో రెబల్స్ లొల్లి