
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ బీజేపీలో చేరారు. అనారోగ్యం కారణంగా గరికపాటి మోహన రావు కార్యక్రమానికి హాజరు కాలేదు. కానీ బీజేపీలో చేరుతున్నట్టు ఓ లేఖ పంపించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా.. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నచ్చే.. నలుగురు ఎంపీలు బీజేపీలోకి వస్తున్నారన్నారు నడ్డా.
ఏపీ విభజన చట్టంలోని అంశాల అమలు స్పీడ్ పెంచేందుకు తమ చేరికలు ఉపయోగపడతాయన్నారు ఎంపీ సుజనా చౌదరి. గతంలో కేంద్రమంత్రిగా మోడీ పాలనను చాలా దగ్గరి నుంచి చూసి.. ప్రభావితమై బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు.
అంతకుముందు.. టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి.. నలుగురు ఎంపీలు లెటర్ ఇచ్చారు. వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లిన సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్.. ఆయనకు లెటర్ అందజేశారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా, కేంద్రమంత్రులు థావర్ చంద్ గెహ్లాట్, కిషన్ రెడ్డి సమక్షంలో వీరు వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు.