ప్రాంతీయ పార్టీలన్నీ ఫ్యామిలీ పార్టీలే..

ప్రాంతీయ పార్టీలన్నీ ఫ్యామిలీ పార్టీలే..
  • రాష్ట్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తది: జేపీ నడ్డా
  • ప్రాంతీయ పార్టీలన్నీ ఫ్యామిలీ పార్టీలే.. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రిశ్వత్ సమితి
  • రజాకార్లతో చేతులు కలపడానికి కేసీఆర్‌‌‌‌కు సిగ్గుండాలని ఫైర్
  • రాష్ట్రంలో బీజేపీనే కీలకం కాబోతున్నది: బీఎల్ సంతోష్
  • బీఆర్ఎస్‌‌వి బట్టేబాజ్ పనులు.. చెప్పేవి శ్రీరంగ నీతులు: కిషన్ రెడ్డి


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కుటుంబ పాలన అంతం కావడం ఖాయమని, బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఫ్యామిలీ పార్టీలేనని విమర్శించారు. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదన్నారు. శుక్రవారం హైదరాబాద్ శివారు ఘట్కేసర్‌‌‌‌లో జరిగిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి చీఫ్ గెస్టుగా నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ అంటేనే ‘భ్రష్టాచార్ రిశ్వత్ సమితి’. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే. అందులో తెలంగాణ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు స్థానం ఉండదు. కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు.. ఇలా పెత్తనం అంతా ఒకే కుటుంబానిది” అని ఆరోపించారు. 

ఏపీలో కూడా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆయన కొడుకు జగన్ పార్టీ నడుపుతున్నారని, ఆయన ఇప్పుడు తన చెల్లెలిని కూడా పార్టీకి దూరంగా పెట్టారని నడ్డా ఆరోపించారు. ‘‘దేశంలో కుటుంబ పార్టీ కానిది బీజేపీ ఒక్కటే. ఈ పార్టీలో సాధారణ కార్యకర్త కూడా ఉన్నత స్థానంలో ఉంటారు” అని చెప్పారు. రజాకార్లతో చేతులు కలపడానికి కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ పాలన.. రజాకార్లను తలపిస్తున్నదని మండిపడ్డారు. 

కాంగ్రెస్ ఎందుకు అభివృద్ధి చేయలే

బీజేపీ నేతలు ప్రతి ఒక్కరు గ్రామాలకు వెళ్లాలని, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నడ్డా సూచించారు. తెలంగాణకు మోదీ ఇచ్చిన ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణలో బీజేపీ గెలవాలని, మరోసారి కేంద్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని హామీలనూ అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. పీఎం ఆవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లను కేంద్రం నిర్మించిందని, మరి తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారా? అని నిలదీశారు. దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది రైతుల అకౌంట్ లో కేంద్రం డబ్బులు జమ చేస్తున్నదని, ఇందులో 38.50 లక్షల మంది తెలంగాణ రైతులు ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణలో 31 లక్షల స్వచ్ఛ్ మూత్రశాలలను నిర్మించిన ఘనత మోదీ సర్కార్ దేనన్నారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లను కేంద్రం కేటాయించిందని, ఈ నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులు జరిగాయని నడ్డా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హైవేల సంఖ్య పెరిగిందని, ఇప్పుడు తెలంగాణ రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించాలని కోరారు. ప్రధాని మోదీ కేవలం రెండు రోజుల్లోనే రూ.20 వేల కోట్లకు పైగా నిధులతో రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని తెలిపారు. ప్రతి కార్యకర్త బీజేపీ గొంతుకగా

మారాలి: బండి సంజయ్

బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పోరాడాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిచ్చారు. పొరపాటున కేసీఆర్ మళ్లీ సీఎం అయితే తెలంగాణ మరో శ్రీలంకలా మారే ప్రమాదం ఉందన్నారు. ‘‘కాంగ్రెస్ ఢిల్లీలో లేదు.. గల్లీలో లేదు. బీజేపీని దెబ్బతీసేందుకు కేసీఆరే కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచే కుట్ర చేస్తున్నారు” అని చెప్పారు. ప్రతి కార్యకర్త బీజేపీ గొంతుకగా మారి ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. ‘‘కేసీఆర్ భేషుగ్గా ఉన్నాడట. చుక్క, ముక్క వేసుకుని ఎంజాయ్ చేస్తున్నడట. కేసీఆర్ సడ్డకుడి కొడుకును ఇంటికి రానీయడం లేదు. కేసీఆర్ కుటుంబంలో లొల్లి మొదలైంది. కొడుకును సీఎం చేయాలనుకున్నడు. హరీశ్ రావు అలిగిండు. కవిత ఇంట్లోనే మకాం వేయడంతో సీఎంను చేసే నిర్ణయాన్ని వాయిదా వేసిండు. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే కేటీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి” అని డిమాండ్ చేశారు. 
తుది శ్వాస వరకు

బీజేపీలోనే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. స్టేట్ కౌన్సిల్ సమావేశం తర్వాత బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తుది శ్వాస ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతానని, పార్టీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఎల్బీనగర్, మునుగోడు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని అక్కడి ప్రజలు నాపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఏ నియోజకవర్గం అనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది” అని చెప్పారు.సమావేశంలో పార్టీ నేతలు ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, విజయ రామారావు, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.

నడ్డాతో విడివిడిగా సమావేశమైన నేతలు

నడ్డాతో పలువురు సీనియర్ నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్​ రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు నడ్డాను ప్రత్యేకంగా కలిసి తమ అభిప్రాయాలను, పార్టీ పరిస్థితిని ఆయనకు వివరించారు.

ప్రమాదకర పరిస్థితుల్లో తెలంగాణ: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ చేసేవి బట్టేబాజ్ పనులు.. చెప్పేవి శ్రీరంగ నీతులని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో కొన్ని కుక్కలు ట్విట్టర్లో మోదీపై మోరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. ‘‘తండ్రిని అడ్డంపెట్టుకొని అధికారంలోకి వచ్చిన నాయకుడి స్థాయి ఎంత? మోదీని విమర్శించడమా? ఇంకోసారి మా నాయకుడిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోం. చదివింది అమెరికాలో.. కాని ఆయన మాత్రం థర్డ్ గ్రేడ్ లత్కొర్ మాటలు మాట్లాడుతున్నారు” అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇతర ప్రాంతాల ముస్లింలను ఓటరు జాబితాలో నమోదు చేస్తున్నారని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకారంతో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని మజ్లిస్ కుతూహలంగా ఉందన్నారు. రాష్ట్రంలో సకల సమస్యలకు కారణం కాంగ్రెస్సేనని ఆరోపించారు. కాంగ్రెస్‌‌‌‌కు తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదన్నారు.

అమిత్ షా టూర్ ఖరారు

రాష్ట్రంలో ఈ నెల 10న జరగనున్న రెండు బహిరంగ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. 10న మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్ టౌన్ లో మొదటి బహిరంగ సభ ఉంటుంది. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ లో నిర్వహించే మరో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. పార్టీ స్టేట్ కౌన్సిల్ సమావేశాల్లో ఈ మేరకు అమిత్ షా టూర్ ఖరారైంది.

జనంలో బలంగా ఉన్న వారికే టికెట్: బీఎల్ సంతోష్

తెలంగాణలో హంగ్ ఏర్పడబోతున్నదని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. ‘‘బీజేపీ చేయించిన సర్వేల ప్రకారం రాష్ట్రంలో ఏ పార్టీకీ సొంతంగా అధికారం చేపట్టేందుకు కావాల్సిన 60 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనమే కీలకం కాబోతున్నాం. అధికారంలోకి మనమే వస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో 119 అసెంబ్లీ సీట్ల కోసం కనీసం 2 వేలకు పైగా మంది టికెట్లను ఆశిస్తున్నారు. ‘పార్టీలో మొదటి నుంచి ఉంటున్నాం.. మేమే సీనియర్లం.. మాకే టికెట్ ఇవ్వాలి’ అంటే కుదరదు.. జనంలో బలంగా ఉన్న వారికే టికెట్ ఇస్తాం” అని స్పష్టంచేశారు. సీఎం ఎవరనేది జాతీయ నాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. ‘‘పార్టీలో ఏ నాయకుడు కూడా ‘నేనే సీఎం అభ్యర్థిని’ అని ప్రచారం చేసుకోవద్దు. ఎవరి పొజిషన్ ఏమిటనేది హైకమాండ్ వద్ద అన్ని లెక్కలు ఉన్నాయి. కలిసికట్టుగా పనిచేసి బీజేపీని అధికారంలోకి తీసుకురండి. అందరినీ పార్టీ గుర్తిస్తుంది” అని సూచించారు.