రాష్ట్ర బీజేపీ నేతలకు జేపీ నడ్డా వార్నింగ్..

రాష్ట్ర బీజేపీ నేతలకు జేపీ నడ్డా  వార్నింగ్..
  • వ్యాఖ్యలు చేసినోళ్లు పార్టీలో ఉంటారా..?
  • గీత దాటి ఎందుకు మాట్లాడినట్టు? 
  •  వాళ్ల అక్కసు ఎవరి మీదు..? ఎందుకు!
  • నివురుగప్పిన నిప్పులా బీజేపీ గ్రూపులు

హైదరాబాద్: బీజేపీ సైద్ధాంతిక పార్టీ.. క్రమ శిక్షణకు మారుపేరు.. ఏ విషయం ఎవరు ఎప్పుడు మాట్లాడాలనేది ముందే డిసైడ్ అవుతుంది.. ఆ అంశంపై వాళ్లే సమాధానం చెబుతారు..! అంతకు మించి మాట్లాడరు..! ముఖ్యంగా అంతర్గత అంశాలపై అస్సలు నోరెత్తరు! ఆసేతు హిమాచలం కాషాయ జెండా ఎగరేయడమే ఎజెండగా ముందుకు సాగుతున్న కమలం టీం తెలంగాణలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది..! నేతలు ఎవరికి వారుగా చిట్ చాట్ లు పెట్టి పార్టీ గీతదాటుతున్నారు. లైన్ దాటి మాట్లాడుతున్నారు. పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత మీడియాపై అక్కసు వెళ్లబోసుకుంటున్నారు.. తామలా అనలేదని, మీడియా వక్రీకరించిందని మాటమార్చుతున్నారు. కొందరు ట్విట్టర్ వేదికగా పార్టీని ఉద్దేశించి వ్యంగ్యమైన పోస్టింగులు పెడుతున్నారు. ఆ తర్వాత తన ఉద్దేశం అది కాదని, ఇదని పేర్కొంటూ మరో వివరణ అదే ట్విట్టర్ వేదికగా ఇచ్చుకుంటున్నారు. 

ఇంకో నేత.. పార్టీలో చేరాలని వేరే నేత దగ్గరికి వెళ్తే.. ఆయనే కౌన్సిలింగ్ ఇస్తున్నారని, నేను వాళ్లకు చెప్పే పరిస్థితి లేదంటూ పరోక్షంగా పార్టీలోకి ఎవరు రారనే సంకేతాలనే ఇచ్చేశారు.. ఇలా నాయకులు నోరు జారుతుండటం,, ఏకగా మీడియాతోనే మదిలో మాట చెప్పేయడం తర్వాత నాలుక్కరుచుకొని దిద్దుబాటు చర్యలకు దిగడం పరిపాటిగా మారింది. ఈ తరహా పాలిటిక్స్ పై బీజేపీ కేంద్ర నాయకత్వం ఆగ్రహంతో ఉంది. నిన్న రాత్రి శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా క్లాస్ తీసుకున్నారు. బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరని, పరస్పర ఆరోపణలో పార్టీకి నష్టం చేసే వారిని సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేనంతగా పార్టీ అంతర్గత విషయాలు ప్రజల్లో చర్చనీయాంశం కావడం ఆమోద యోగ్యం కాదని చెబుతూనే ఇక నుంచి తెలంగాణలో క్రమం తప్పకుండా పార్టీ అగ్రనేతల పర్యటనలుంటాయని చెప్పారు. 

మునుగోడు ఎన్నిక తర్వాతే ముసలం

దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఊపుమీదున్న బీజేపీని మునుగోడు ఓటమిని ఇబ్బందుల పాలు చేసింది. ఆ తర్వాత ఎవరికి వారు విశ్లేషణలు ప్రారంభించారు. పార్టీలో నిరసన గళాలు పెరిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇవ్వడం.. ఎలాంటి చర్యలూ లేకపోవడం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వారికి అనుమానాలు వచ్చేలా చేసింది. కారుతో పోరాడుతామని వస్తే పరిస్థితి మారుతోందేమిటి..? అన్న సందేహాల్లో పడేశాయి. ఇటు పార్టీలో ప్రాధాన్యం దక్కక.. కమలం విడిచి వెళ్లలేక తమ నిరసనను రకరకాల రూపాల్లో వెళ్లగక్కారనే చర్చ ఉంది. 

వాళ్లు గోడ దూకేస్తారా..?

పార్టీ గీత దాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారు గోడదూకడం పక్కా అనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. పార్టీ నాయకత్వానికీ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయి. ప్రస్తుతానికి మీడియా ముందు హమ్ సాథ్.. సాథ్ హై అంటూ ఐక్యతారాగాలు ఆలపిస్తున్నా.. పార్టీ మారడం పక్కా అనే వాదన మరో వైపు బలంగా వినిపిస్తోంది. 

పదవుల కోసం పెదవులు తెరవొద్దు

గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బేరీజు వేసుకున్న జేపీ నడ్డా.. కొందరు నేతలతో ఒక్కొక్కరిగా సమావేశమయ్యారు. పలురువు నాయకులు తమకు పార్టీలో పదవులు ఇవ్వాలని జేపీ నడ్డాను కోరారు. దీనిపై స్పందించిన ఆయన రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ఇతర అంశాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారని సమాచారం.