ఆ ఘటన నా మనసును కలచివేసింది

ఆ ఘటన నా మనసును కలచివేసింది

ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. కానీ ఆ విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి కానీ.. వ్యక్తిగత దూషణలు, విమర్శలు తగదన్నారు.  అసెంబ్లీలో నిన్న జరిగిన ఘటన తన మనసును కలిచివేసిందన్నారు. ఎప్పుడు అయితే మనం ప్రజా సమస్యలు పక్కన పెట్టి మన ఆడ పడుచులపై పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది అరాచక పాలనకు నాంది పలుకుతుందన్నారు జూనియర్ ఎన్టీఆర్. మన సంప్రదాయాల్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అప్పచెప్పాలన్నారు. 

స్త్రీలను గౌరవించడం అనేది...  మన నవనాడుల్లో, రక్తంలో ఇమిడిపోయే సంప్రదాయమన్నారు. కానీ మన సంస్కృతి కాల్చివేసి భావితరాలకు బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది పొరపాటు అన్నారు. ఈ మాటలు వ్యక్తిగత దూషణలకు గురైన  ఓ కుటుంబానికి చెందిన వ్యక్తిగా మాట్లాడటం లేదన్నారు. తాను  ఓ కొడుకుగా, ఓ భర్తగా, తండ్రిగా, ఓ భారతీయ పౌరుడిగా మాట్లాడుతున్నానన్నారు. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడాలన్నారు. ఇది తన విన్నపమన్నారు. ఇది ఇక్కడితో ఆగిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.