- అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలని సర్కారు నిర్ణయం
- రోడ్లు, నాలాలు, చెత్త సేకరణ, ఇతర మౌలిక వసతులపై దృష్టి
- ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు
- ఎలివేటెడ్ కారిడార్, మెట్రో పనులూ స్పీడప్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ముగియడంతో ఇక గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లు, నాలాల రిపేర్లతో పాటు ఇతర మౌలిక వసతులను మెరుగుపరచాలని భావిస్తోంది. ప్రధానంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీల లీకులను అరికట్టాలని, చెత్త సేకరణ సమస్యలను పరిష్కరించాలని యోచిస్తోంది.
ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రతిపాదనలను సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ అధికారులను సర్కారు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన గ్రేటర్ హైదరాబాద్ అధికారులు.. పెండింగ్ సమస్యలతో పాటు కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అందుకయ్యే నిధుల వివరాలతో నివేదిక రెడీ చేస్తున్నారు. వారం రోజుల్లోనే ప్రభుత్వానికి రిపోర్ట్ అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9,013 కిలోమీటర్ల రోడ్లు ఉండగా ఇందులో 2,846 కి.మీ. బీటీ రోడ్లు, 6,167 కి.మీ. అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి. అన్ని చోట్ల కలిపి సుమారు 5,00 కి.మీ. మేరకు రోడ్లు అక్కడక్కడ దెబ్బతిని గుంతలు పడగా, వీటిని బాగు చేయడానికి సర్కారు సమాయత్తం అవుతున్నది. రోడ్ల బాగు కోసం అవసరమైన నిధులపై ప్రతిపాదనలు రెడీ చేసి పంపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
దీంతో కొద్ది రోజుల్లోనే గ్రేటర్ పరిధిలో సేఫ్టీ డ్రైవ్ చేయడానికి వీలుగా రోడ్లను బాగు చేయనున్నారు. అలాగే గ్రేటర్ పరిధిలో రోడ్లపై గుంతలను వెంటనే పూడ్చివేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్ తేవాలని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం రోడ్ల మరమ్మతుల కోసం జీహెచ్ఎంసీకి వస్తున్న ఫిర్యాదులపై జవాబుదారీతనం లోపించింది. గుంతలను సకాలంలో పూడ్చకపోవటంతో ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోతున్నారు.
అందుకే మొబైల్ యాప్ తీసుకొచ్చి ఒక్కో డివిజన్ కు ఒక లాగిన్ ఐడీని అందించనున్నారు. త్వరలోనే ఈ యాప్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. గ్రేటర్ పరిధిలోని150 డివిజన్లలో రోడ్లను గడువులోగా రిపేర్ చేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలుసుకుని, మానిటరింగ్ చేసేలా సర్కారు నుంచి ఆదేశాలు వచ్చాయి.
ఎలివేటెడ్ కారిడార్ పనులు స్పీడప్
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డెయిరీఫామ్ వరకూ 5 కి.మీ. ఎలివేటేడ్ కారిడార్1 పనులు మొదలవ్వగా, జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకూ18 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ 2 పనులనూ మొదలుపెట్టడానికి సర్కారు నిర్ణయం తీసుకున్నది.
రూ.1,550 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తిచేయాలని భావిస్తున్నది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే నేషనల్హైవే 44 బోయిన్పల్లి, కొంపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్‌పూర్ రూట్లలో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గనున్నాయి. సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ వల్ల సిద్దిపేట, కరీంనగర్, గజ్వేల్ తదితర రూట్లలో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి.
నాలాల రిపేర్లు, చెత్త సేకరణపై దృష్టి
గ్రేటర్ పరిధిలో వానలు పడినప్పుడు నాలాలు సరిగ్గా లేక కాలనీలు నీట మునగడం పరిపాటిగా మారింది. అందుకే అన్ని డివిజన్లలో నాలాలను సరిచేయాలని సర్కారు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం నాలాలను హైడ్రా మానిటరింగ్ చేస్తుండగా, అన్ని డివిజన్లలోని నాలాలపై ఆక్రమణలు తొలగించాలని సర్కారు ఆదేశించింది. గ్రేటర్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా మారడంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఉదయం 9.30లోపు అన్ని డివిజన్లలో చెత్త సేకరణ పూర్తిచేసి డంపింగ్ యార్డ్‌కు తరలించాలని ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో శానిటేషన్ టెండర్ దక్కించుకున్న రాంకీ సంస్థ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చెత్త సేకరణ చేసేలా జీహెచ్ఎంసీ నుంచి ఆదేశాలు ఇవ్వనున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా చెత్తను తరలించేందుకు 2009లో రాంకీ సంస్థతో 25 ఏళ్లకు జీహెచ్ఎంసీ అగ్రిమెంట్ చేసుకొని ఒక మెట్రిక్ టన్ను చెత్త తరలింపుకు రూ.2,750 చెల్లిస్తున్నది.
ప్రస్తుతం నగరంలో డైయిలీ 7,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇకపై చాలా పారదర్శకంగా చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను నిర్వహించనున్నారు.
కొత్తగా మరో 200 బస్సులు
గ్రేటర్ లో ఇప్పటికే 2,800 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. అయినా ప్రయాణికులకు బస్సు సర్వీసులు సరిపోవట్లేదని ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా సర్కారు దృష్టికి వచ్చింది. దీంతో గ్రేటర్ పరిధిలో మరో 200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు తేవడానికి సర్కారు సిద్ధమవుతోంది.
ఇదివరకే ఉన్న 250 ఎలక్ట్రిక్ బస్సులకు కొత్తవి రానుండటంతో అన్ని ఆర్టీసీ బస్ డిపోల్లో చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు పనులనూ స్పీడప్ చేయనుంది. అలాగే, ఓల్డ్ సిటీలో పెండింగ్‌లో ఉన్న మెట్రో పనులను కూడా సర్కారు స్పీడప్ చేయనున్నది.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు పనులను వేగవంతం చేయనున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీర్చిదిద్దబోతున్న ప్యూచర్ సిటీ వరకు మెట్రోను పొడిగించే పనులపై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి ఈ పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
హెచ్ సిటీ పనులూ స్పీడప్..
గ్రేటర్ లో హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) పేరుతో రూ. రూ.7,032 కోట్లతో చేపట్టిన పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను సర్కారు ఆదేశించింది. ఈ పనులను ఆరు నెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. హెచ్ సిటీ కింద 25 పనులు చేపట్టగా ఇందులో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్ఓబీలు, రోడ్డు విస్తరణ వంటి పనులు ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని పనులు టెండర్ దశలో ఉండగా, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు త్వరగా ప్రారంభించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు.
తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చర్యలు
గ్రేటర్ లో చాలా డివిజన్లలో రెండు రోజులకోసారి తాగునీరు సప్లయ్ చేస్తున్నారని ఇటీవల అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నీటి సరఫరాను మెరుగుపర్చేందుకు సర్కారు ఆదేశాల మేరకు మెట్రో వాటర్‌బోర్డు ఆఫీసర్లు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి రెండో దశ పనులు ప్రారంభం కాగా త్వరలోనే మరికొన్ని పనులను చేపట్టాలని సర్కారు భావిస్తోంది.
ఇందులో సింగూరు, మంజీరా పైప్లైన్లు శిథిలావస్థకు చేరుకుంటున్న నేపథ్యంలో వాటికి సమాంతరంగా మరో పైప్‌లైన్ ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్స్ వరకూ ఉన్న కాండ్యూట్(కాలువ)కు లీకేజీలు అరికట్టి నీటి వృథాను ఆపాలని, ఈ కాండ్యూట్ పొడవునా మరో పైప్‌లైన్ నిర్మించాలని ప్రపోజల్స్ రూపొందిస్తున్నారు. అలాగే, ఓఆర్ఆర్ పరిధిలో అమృత్ పథకం కింద గ్రేటర్ లో ఉన్న 39 ఎస్టీపీలకు అదనంగా రూ. 3,500 కోట్లతో మరో 39 ఎస్టీపీలు నిర్మించనున్నారు.
ఇందిరమ్మ ఇండ్లపై దృష్టి..
గ్రేటర్లో 24 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు ఒక్కో సెగ్మెంట్లో 3,500 మంది చొప్పున అర్హులను ఎంపిక చేయాలని సర్కారు భావిస్తున్నది. మొదటి విడతలో 84 వేల మందికి ఇండ్లు కేటాయించనుంది. ముందుగా సొంత జాగ ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే, గ్రేటర్లో ఇంకా ఖాళీగా ఉన్న డబుల్‌బెడ్ రూం ఇండ్లను అర్హులకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
అన్ని చోట్ల కలిపి ఇంకా 4 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 1,400, సంగారెడ్డిలో 802, మేడ్చల్–మల్కాజిగిరిలో 1,043, రంగారెడ్డిలో 800 ఇండ్లు ఉన్నాయి. గతంలో వచ్చిన దరఖాస్తుల్లోని అర్హులకే వీటిని ఇచ్చేలా ప్రక్రియను మొదలుపెట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
