జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. విజయమే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు బరిగీసి కొట్లాడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇన్నాళ్లూ మంత్రుల వరకే ప్రచారంలో పాల్గొనగా, శుక్రవారం స్వయంగా సీఎం రేవంత్ రంగంలోకి దిగారు. వెంగళరావునగర్, సోమాజిగూడ డివిజన్లలో రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తించారు.
జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. అటు ఎర్రగడ్డ డివిజన్‌లో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, షేక్‌పేట డివిజన్‌లో బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. ముగ్గురు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడ్డారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్నది. 14న ఫలితం తేలనున్నది.
